Neeraj Chopra : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు ఆటలు రద్దు అవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 18వ సీజన్‌ను బీసీసీఐ వారం రోజులు వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో జావెలెన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పేరిట తొలిసారి నిర్వహించ తలపెట్టిన ‘నీరజ్ చోప్రా క్లాసిక్'(NC Classic) ఈవెంట్‌ను సైతం వాయిదా వేస్తున్నట్టు చెప్పాడు. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం అతడు వెల్లడించాడు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తానని తెలిపాడీ బడిసె వీరుడు.
షెడ్యూల్ ప్రకారం మే 24న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో పరిస్థితులు మారిపోయాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత.. విమాన సంస్థలు సర్వీస్‌లు నిలిపివేయడం వలన టోర్నీ నిర్వహణ సాధ్యపడదని గ్రహించిన చోప్రా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.
STATEMENT. pic.twitter.com/S6EdZ87ITh
— Neeraj Chopra Classic (@nc_classic) May 9, 2025
‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నీని వాయిదా వేస్తున్నాం. ఈ నిర్ణయం హఠాత్తుగా తీసుకున్నది కాదు. అందరితో చర్చించాకే వాయిదానే మంచిదని అనుకున్నాం. తదుపరి కొత్త తేదీలను వెల్లడిస్తాం. ఉద్రిక్తత వాతావరణం నడమ సైనికులు, దేశానికి మద్దుతుగా నిలవడం ముఖ్యమని భావించాం. ఈ కఠిన సమయంలో మా అందరి ప్రార్ధనలు భారత సైన్యం చుట్టేనే తిరుగుతుంటాయి. జై హింద్’ అని ఎక్స్ పోస్ట్ ద్వారా వివరించాడు నీరజ్.
ఏప్రిల్ నెలలోనే చోప్రా ఈ పోటీల గురించి ప్రముఖ అథ్లెట్లకు ఆహ్వానాలు పంపాడు. ఈ క్రమంలోనే జావెలిన్ త్రోయర్.. స్నేహితుడు అయిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను భారత్‌కు రావాల్సిందిగా చోప్రా ఆహ్వానించాడు. అయితే.. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత నెటిజన్లు కొందరు చోప్రాను టార్గెట్ చేశారు. శత్రు దేశం అథ్లెట్‌ను పోటీలకు పిలుస్తావా? అతడిపై ట్రోలింగ్ చేశారు. అందుకు ఎంతగానో బాధ పడిన నీరజ్ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. రెండు ఒలింపిక్ పతకాలు అందించిన తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని, అందరూ ఆటగాళ్లను పిలిచినట్టుగానే నదీమ్‌కు కబురు పంపానని చెప్పాడు.
— Neeraj Chopra (@Neeraj_chopra1) April 25, 2025
భారత దేశంలో జావెలిన్ త్రో ఆటకు గుర్తింపు తీసుకొచ్చిన చోప్రా.. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో ఈటెను దూరం 89.45 మీటర్ల విసిరి రజతంతో చరిత్ర సృష్టించాడు. అంతకుముందు టోక్యోలో పసిడితో మెరిసిన అతడు.. వరుసగా రెండు విశ్వక్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్యారిస్‌లో స్వర్ణంపై గురి పెట్టిన చోప్రాకు నదీమ్ షాకిచ్చాడు. ఏకంగా ఈటెన్ 90 మీటర్ల దూరం విసిరాడు నదీమ్. దాంతో, భారత స్టార్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు.