Srisialam | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున సమేత శ్రీశైలం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఈవో శ్రీనివాసరావు భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయం పరిధిలో అన్ని చోట్ల తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఇందు కోసం పోలీసుశాఖ నుంచి సహాయక సహకారాలు తీసుకోవాలని చెప్పారు.
దేవస్థానం టోల్గేట్ వద్ద క్షుణ్నంగా తనిఖీలు చేయాలని తెలిపారు. క్యూకాంప్లెక్స్ ప్రవేశద్వారం, ప్రధాన ఆలయం, క్షేత్ర పరిధిలో జనసమ్మర్థ ప్రదేశాలు, సాక్షి గణపతి, హాఠకేశ్వరం, పాలధార పంచధార, శిఖరేశ్వరం తదితర చోట్ల భద్రత కట్టుదిట్టంగా ఉండాలని, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కంట్రోల్ రూం సిబ్బంది సైతం జాగ్రత్తగా ఉంటూ.. అన్ని ప్రాంతాలను పరిశీలిస్తూ విధుల్లో ఉన్న సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తుండాలని సూచించారు.
క్షేత్రపరిధిలోని ఆయా ప్రదేశాలన్నీ ప్రస్పుటంగా కనిపించేలా సీసీ కెమెరాలతో నిఘా వేయాలన్నారు. ఇదిలా ఉండగా.. భద్రతా చర్యల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి దేవస్థానం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో నంద్యాల ఎస్పీ అధిరాజ్ రాణా ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఆలయంలోని అన్ని సతాలు, క్షేత్రానికి వచ్చిపోయే వాహనాలను సీఐ ప్రసాదరావు, స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీ చేశారు. శ్రీశైల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరిపైనా అనుమానం వస్తే పోలీసులు, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.