లాసానే: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నయా చరిత్ర లిఖించాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన నీరజ్ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో పసిడి వెలుగులు విరజిమ్మాడు. శుక్రవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ 89.08 మీటర్ల దూరం విసిరి టైటిల్‌తో మెరిశాడు. గజ్జల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఈ యువ అథ్లెట్ తనదైన శైలిలో ప్రత్యర్థులకు దీటైన సవాలు విసురుతూ తన తొలి ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. తద్వారా డైమండ్ లీగ్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. తన రెండో ప్రయత్నంలో బరిసెను 85.18మీటర్లు విసిరిన నీరజ్..తిరిగి 89మీటర్ల మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఆఖరిదైన ఆరో ప్రయత్నంలో 80.04 మీటర్లకే పరిమితమయ్యాడు. జాకబ్ వాద్లెచ్(85.88మీ),
కర్టిస్ థామ్సన్(83.72మీ) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. స్వర్ణం గెలువడం ద్వారా సెప్టెంబర్‌లో జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు నీరజ్ అర్హత సాధించాడు. లాసానే టోర్నీ తర్వాత టాప్-6లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడుతారు. దీనికి తోడు వచ్చే ఏడాది బుడాపెస్ట్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు చోప్రా బెర్తు దక్కించుకున్నాడు.