Neeraj Chopra : ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ సీజన్లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం దోహాలోని డైమండ్ లీగ్ (Diamond League)లో పోటీపడుతున్న నీరజ్.. త్వరలోనే పోలాండ్‌లో బరిలోకి దిగనున్నాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల కారణంగా అర్షద్ నదీమ్ (Arshad Nadeem)తో మునపటిలా సన్నిహితంగా ఉండబోనని స్పష్టం చేశాడీ బడిసె వీరుడు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను, పాక్ జావెలిన్ త్రోయర్ నదీమ్ ప్రాణ స్నేహితులం కాదని.. పోటీదారులం మాత్రమేనని చెప్పాడు.
‘మీరు అనుకుంటున్నట్టుగా నేను, నదీమ్ ప్రాణ స్నేహితులం కాదు. ఈమధ్య ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై నేను నదీమ్‌తో ఫ్రెండ్లీగా ఉండను. ఈ విషయాన్ని నేను మరోసారి మీకు స్పష్టం చేస్తున్నా. అయితే.. నాతో గౌరవంగా మాట్లాడే వాళ్లతో నేను అలానే వ్యవహరిస్తాను. అథ్లెట్లుగా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం అంతే. నాకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్నేహితులు ఉన్నారు.
🚨#News | “Firstly, I want to clarify that we never had a very strong relationship,” said Neeraj Chopra on Arshad Nadeem.
Neeraj was quizzed about his equation with the Pakistani javelin thrower at a press conference ahead of the Doha Diamond League event on Thursday.
He also… pic.twitter.com/OXqVNGypUu
— The Bridge (@the_bridge_in) May 15, 2025
వాళ్లంతా తమ దేశానికి పతకం సాధించాలనే కసితో పోటీ పడుతుంటారు. నేను కూడా అంతే’ అని నీరజ్ వెల్లడించాడు. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల సమయంలో కొందరు నీరజ్, అతడి కుటుంబాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా క్లాసిక్ టోర్నమెంట్లో పాల్గొనాల్సిందిగా నదీమ్‌కు ఆహ్వానం పంపడమే అందుకు కారణం. దాంతో, తమను లక్ష్యంగా చేసుకున్న ట్రోలర్స్‌కు చోప్రా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాను రెండు ఒలింపిక్స్ పతకాలతో దేశం గర్వపడేలా చేశానని, తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ రజతం గెలుపొందగా.. నదీమ్ 90 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకం సాధించాడు. దాంతో, టోక్యోలో స్వర్ణంతో మెరిసిన నీరజ్.. ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ సమయంలో అతడి తల్లి సరోజ్ దేవి (Saroj Devi) తనకు నదీమ్ కూడా బిడ్డతో సమానమే అని చెప్పింది. పాక్ అథ్లెట్ అమ్మ రజియా పర్వీన్ సైతం కూడా నీరజ్, నదీమ్‌ల స్నేహాన్ని ప్రశంసించింది. దాయాది దేశానికి ఇద్దరు అథ్లెట్లు సోదరభావంతో మెలగడం క్రీడా స్ఫూర్తికి సంకేతమని పలువురు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.