IPL 2025 : ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్ మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశముంది. అయినా సరే ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) ఉన్నాడనే భరోసాతో ఉన్న ఢిల్లీకి పెద్ద షాక్. ఈ స్పీడ్‌స్టర్ భారత్‌కు రావడం మరింత ఆలస్యం కానుంది. అతడికి బంగ్లాదేశ్ క్రికెట్ దేశ బోర్డు ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) ఇంకా ఇవ్వలేదు.
ప్రస్తుతం ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ జట్టుతో పాటు యునైటెడ్ అరమ్ ఎమిరేట్స్(UAE)లో ఉన్నాడు. యూఏఈ, పాకిస్థాన్, బంగ్లా మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ మే 17 నుంచి జరుగనుంది. దాంతో, ముస్తాఫిజుర్‌కు వాళ్ల బోర్డు ఎన్ఓసీ ఇస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. బీసీసీఐతో మాట్లాడించి బంగ్లా క్రికెట్ పెద్దలను ఒప్పించాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది. అదే జరిగితే.. ముస్తాఫిజుర్‌కు ఎన్ఓసీ త్వరగానే రావచ్చని సమాచారం.
ఐపీఎల్ వారం పాటు వాయిదా పడడంతో స్వదేశం వెళ్లిన యువ హిట్టర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (Jake Fraser McGurk) తదుపరి మ్యాచ్‌లకు భారత్ రావడం లేదు. దాంతో, అతడి స్థానంలో ముస్తాఫిజుర్‌తో ఢిల్లీ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది. దాంతో, రెండేళ్ల తర్వాత ముస్తాఫిజుర్ ఢిల్లీ స్క్వాడ్‌లో కలువనున్నాడు. ఒకవేళ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కూడా ఐపీఎల్‌కు దూరమైతే.. అతడి స్థానాన్ని ముస్తాఫిజుర్ భర్తీ చేయడం ఖాయం.
ముస్తాఫిజుర్ 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2022, 2023 సీజన్లలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. 8 మ్యాచుల్లో 7.62 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. సీఎస్కేకు కూడా ఆడిన అనుభవం ముస్తాఫిజుర్‌కు ఉంది. ఐపీఎల్లో మొత్తంగా ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 38 మ్యాచులు ఆడి.. 38 వికెట్లు పడగొట్టాడు.
పద్దెనిమిదో సీజన్లో అక్షర్ పటేల్(Axar Patel) నేతృత్వంలోని ఢిల్లీ ప్రస్తుతం 6 విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. మే 18న గుజరాత్ టైటాన్స్, మే 21న ముంబై ఇండియన్స్, మే 24న పంజాబ్ కింగ్స్‌తో అక్షర్ సేన తలపడనుంది. ఈ మూడింటా గెలిస్తే.. ఢిల్లీ ఖాతాలో 19 పాయింట్లు ఉంటాయి. మే 9న పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ ఢిల్లీకి వస్తుంది. అప్పుడు 20 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం.