నర్సాపూర్,మే15 : గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్‌కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామపంచాయతీల్లో పారిశుద్ద్యం ఎక్కడపడితే అక్కడ పడకేసింది. వివరాల్లోకి వెళ్లితే మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామంలో పారిశుద్ద్య లోపం కండ్లకు కట్టినట్లు కనపడుతుంది. మురికి కాలువలలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం చేరింది. దీంతో దోమల, ఈగల బెడద పెరిగి ప్రజారోగ్యానికి సమస్యగా మారే అవకాశాలున్నాయి. గ్రామపంచాయతీ ట్రాక్టర్లో డీజీల్ పోయడానికి డబ్బులు లేక ట్రాక్టర్‌ను మూలనపడేశారు.
గ్రామంలో జరిగే వివాహ శుభకార్యాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ ట్యాంకర్‌కు రూ.200 సేకరిస్తూ డీజీల్ పోస్తు చెత్తాచెదారాన్ని తొలగించే దయనీయ పరిస్థితికి చేరుకుంది. ఇక గ్రామపంచాయతీ పరిధిలోని అర్జుతాండా, వాల్యాతాండా, వసురాంతాండాలలో ట్రాక్టర్ జాడలే లేక తాండావాసులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికే ట్రాక్టర్ డీజీల్ కోసం పెట్రోల్ బంకులలో సుమారు రూ.50 వేలు ఉద్దెర పెట్టారు. ఈ డబ్బులు కడితే గాని డీజీల్ పోయమని బంకు సిబ్బంది తెగేసి చెప్పారని తెలిసింది. ఇప్పటికైన అధికారులు పట్టించుకొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు కోరుతున్నారు.