ఇండోర్: బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్‌లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘనవిజయం సాధించింది. 76 పరుగుల లక్ష్యఛేదనకు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు.. 18.5 ఓవర్లలో పని పూర్తి చేశారు. ట్రావిస్ హెడ్ (53 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) రాణించారు. తొలి ఓవర్లోనే ఉస్మాన్ ఖవాజా (0) వికెట్ పడగొట్టిన అశ్విన్ ఆశలు రేపినా.. కంగారూలు పట్టుదల ప్రదర్శించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన లియాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఆసీస్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. భారత అవకాశాలు క్లిష్టమయ్యాయి. సిరీస్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో విజయం సాధిస్తే.. రోహిత్ సేన డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవడంతో పాటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరనుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నా.. శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది.
హోల్కర్ చెత్త పిచ్..
తొలి రోజు నుంచే అనూహ్యంగా స్పందించిన ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ ర్యాంకింగ్ ఇచ్చింది. దీంతో పాటు హోల్కర్ మైదానానికి మూడు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్‌లు గెలుస్తున్నంత సేపు ఎవరూ మాట్లాడరు. అదే ఒక్క పరాజయం ఎదురైనా పిచ్‌లపై చర్చ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో సరైన ఆరంభం దక్కలేదు. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం సమర్పించుకున్న తర్వాత కూడా.. రెండో ఇన్నింగ్స్‌లో అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయలేకపోయాం. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. మా దృష్టంతా అహ్మదాబాద్
భారత్ తొలి ఇన్నింగ్స్: 109;
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 197;
భారత్ రెండో ఇన్నింగ్స్: 163;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 78/1 (హెడ్ 49 నాటౌట్, లబుషేన్ 28 నాటౌట్; అశ్విన్ 1/44).
అద్భుతాలు జరుగలేదు.. పరాజయం తప్పలేదు! స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మనవాళ్లు సంచలనం సృష్టిస్తారేమో అనుకున్న అభిమానుల ఆశలపై కంగారూలు నీళ్లు చల్లారు. ఫలితంగా బోర్డర్-గవాస్కర్ మూడో టెస్టులో టీమ్ఇండియా ఓటమి మూటగట్టుకుంది. స్వల్ప లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆ తర్వాత రోహిత్ సేనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లాంఛనాన్ని ముగించి.. దర్జాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది.