హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని ప్లేయర్లను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్, సాట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు జాతీయ వాటర్ పోలో చాంపియన్‌షిప్ జరుగనుంది.
మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వాటర్ పోలో పోటీల గురించి చర్చించారు. హైదరాబాద్ క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నదని తెలిపారు. ఆలిండియా రెండవ జాతీయ వాటర్ పోలో టోర్నీ (మెన్ అండ్ విమెన్) హైదరాబాద్‌లో జరగడం గర్వకారణన్నారు. స్విమ్మింగ్‌తో ఆరోగ్యం, భవిష్యత్తు రెండు బాగుంటాయని తెలిపారు. అందుకే.. పిల్లలకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్‌పై ఆసక్తి పెంచాలని మంత్రి సూచించారు. రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రశేఖర్‌రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హాకీ సంఘం అసోసియేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, సమంతారెడ్డి, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.