ముంబై, సెప్టెంబర్ 18 : దేశ ఆర్థిక వ్యవస్థ క్షేమంగా ఉండాలన్నా, వృద్ధిపథంలో దూసుకుపోవాలన్నా ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నొక్కిచెప్పారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల 35వ సమావేశానికి మల్హోత్రా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ర్టాలు అడ్డగోలు ఖర్చులు చేయవద్దని, అర్థవంతమైన వ్యయాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
అలాగే బడ్జెటేతర రుణాలపట్ల జాగ్రత్త వహించాలని కూడా చెప్పినట్టు ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. కరెన్సీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంశాల్లో ఆర్బీఐ, రాష్ర్టాల మధ్య ఆరోగ్యకరమైన సహకారం, సమన్వయం ఉండాలనీ మల్హోత్రా చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 28 రాష్ర్టాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్థిక కార్యదర్శులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, కాగ్, సీజీఏ హాజరయ్యారు.