హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు ఆ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని, అయినప్పటికీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని నిర్ణయించారని, ఇందుకోసం ప్రజల నుంచి 1,30,000 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ. 70 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇదే జరిగితే తెలంగాణకు 100 టీఎంసీల నీళ్లు రాకుండా ఆగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి వంటి పలు జిల్లాలకు సాగునీరు తగ్గుతుందని, కృష్ణానది ఆయకట్టు రైతులకు నీటి కష్టాలు ఎదురవుతాయని పేర్కొన్నారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నదని వినోద్‌కుమార్ మండిపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రెండు రోజులైనా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కృష్ణానదిలో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని రేవంత్‌రెడ్డి ఇటీవల అన్నారని, మరి అదే కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ఎత్తును పెంచుతుంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
ఆల్మట్టి ఎత్తు పెంపు నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందని వినోద్‌కుమార్ తెలిపారు. డ్యాం ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్రంలోని సాంగ్లీ, కొల్హాపూర్ రెండు జిల్లాలకు ముంపు ముప్పు ఉంటుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారని పేర్కొన్నారు. మన సీఎం రేవంత్‌కు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్టుదలతోనే సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయని వినోద్‌కుమార్ తెలిపారు. ట్రిబ్యునల్ కోసం కేసీఆర్ కేంద్రానికి 33 లేఖలు రాశారని గుర్తుచేశారు. కృష్ణానదిలో నీటి వాటా తెలంగాణకు తగ్గించారంటూ కేసీఆర్‌పై పదేపదే నిందలు వేస్తున్న రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 17 నాటి ప్రసంగంలోనూ కేసీఆర్‌పై విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా కేసీఆర్‌పై నిందలు మాని కర్ణాటక ప్రభుత్వ దూకుడును అడ్డుకోవాలని హితవు పలికారు. కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కంటెప్ట్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.
నీటి వాటాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 511 టీఎంసీలు అంటూ ఒప్పందం చేసింది ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా నుంచి తెలంగాణకు 100 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పెన్నా డెల్టాకు తీసుకువెళ్లిన నీటిని రెగ్యులరైజ్ చేశారని మండిపడ్డారు. ఈ విషయంపై కేసీఆర్ హయాంలో 28 మీటింగ్‌లు పెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్ చేసిన దాంట్లో గోరంత అయినా రేవంత్‌రెడ్డి చేశారా? అని నిలదీశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సీ కల్యాణ్‌రావు, లలితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.