Ashes Test series : మరికొన్ని రోజుల్లో యాషెస్ టెస్టు సిరీస్(Ashes Test Series) మొదలుకానుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆసీస్ సీనియర్ స్పిన్నర్ నాథన్ లయాన్(Nathan Lyon) ఈ సిరీస్ ఫలితంపై సంచలన కామెంట్స్ చేశాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుస్తుందని, ఇంగ్లండ్‌కు తమ చేతిలో వైట్‌వాష్ తప్పదని అతను అన్నాడు.
‘యాషెస్ టెస్టు సిరీస్‌ను మేము 5-0తో గెలుస్తామని వంద శాతం నమ్ముతున్నా. మేము చేయాల్సింది ఒక్కటే.. అక్కడకు వెళ్లి అద్భుతంగా ఆడడం. ఆ దేశ అభిమానుల నోళ్లకు తాళం వేయడం’ అని లయాన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తమ జట్టు ప్రస్తుత ప్రదర్శన పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు. ‘గత 24 నెలలుగా మా జట్టు ఆట తీరు చూసి ఎంతో గర్వపడతున్నా. ఇది నిజంగా ఒక అద్భతమైన ప్రయాణం’ అని లయాన్ అన్నాడు. 2021-22 మధ్య జరిగిన యాషెస్ టెస్టులో అతిథ్య ఆస్ట్రేలియా 4-0తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ప్యాట్ కమిన్స్ సేన ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టులదలతో ఉంది. అయితే.. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
డబ్ల్యూటీసీ – 2023 టెస్టు గదతో ప్యాట్ కమిన్స్, రోహిత్ శర్మ
ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు ర్యాకింగ్స్లో రెండో స్థానంలో ఉంది. భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ఇరుజట్లు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఓవల్ స్టేడియం వేదిక జూన్ 7 నుంచి 11 తేదీల మధ్య భారత్, ఆసీస్ టెస్టు గద కోసం తలపడనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్టు జూన్ 16న ఎడ్జ్‌బాస్టన్ స్టేడయంలో జరగనుంది. జూన్ 28 నుంచి జూలై 3 వరకు జరిగే రెండో టెస్టుకు లార్డ్స్ స్టేడియం వేదిక కానుంది. మూడో టెస్టు జూలై 6 నుంచి 10 వరకు, నాలుగో టెస్టు జూలై 19 నుంచి 23 వరకు, ఐదో టెస్టు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.