Pakistan Cricketer : పాకిస్థాన్ యువ పేసర్ నసీం షా(Naseem Shah) అనగానే బుల్లెట్ లాంటి బంతులు గుర్తుకొస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో సీనియర్ జట్టులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్ అనతికాలంలోనే పేస్ త్రయంలో ఒకడిగా పేరుగాంచాడు. ఇప్పుడు అతడి సోదరుడు కూడా పదునైన యార్కర్లతో బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. నేషనల్ టీ20 కప్‌లో నసీం తమ్ముడు హునైన్ షా(Hunain Shah) యార్కర్‌తో వికెట్లను నేలకూల్చాడు.
లాహోర్ రీజియన్ బ్లూస్ జట్టుకు ఆడుతున్న 19 ఏండ్ల హునైన్.. పెషావర్ రీజియన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యార్కర్‌తో మహ్మద్ హ్యారిస్(Mohammad Haris)ను బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసినోళ్లంతా అన్నను మించిపోయేలా ఉన్నాడే అంటూ హునైన్ను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Hunain Shah ends the @iamharis63 attack with a corker 🎯#NationalT20 | #AajaMaidanMein | #PSHvLHRB pic.twitter.com/OskAVVi1XW
— Pakistan Cricket (@TheRealPCB) December 3, 2023
పాకిస్థాన్ తురుపుముక్క అయిన నసీం షా ఆసియా కప్‌లో గాయపడ్డాడు. సెప్టెంబర్ 11న ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో నసీం భుజానికి గాయమైంది. 46వ ఓవర్ సమయంలో నొప్పితో మైదానం వీడిన అతను ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. ఆ గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి షా దూరమయ్యాడు. స్వింగ్‌తో బెంబేలెత్తించే అతడు ఆడకపోవడం బాబర్ సేన విజయావకాశాల్ని దెబ్బతీసింది. వరల్డ్ కప్‌లో బాబర్ నేతృత్వంలోని పాక్ సెమీస్‌కు ముందే ఇంటి దారి పట్టింది.