ముంబై ఇండియన్స్ మళ్లీ మెరిసింది! మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుని తమకు తిరుగులేదని నిరూపించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది. సహచర బ్యాటర్లు విఫలమైన చోట కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ హర్మన్‌ప్రీత్‌కౌర్ అర్ధసెంచరీతో చెలరేగగా ముంబై పోరాడే స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ వరుసగా మూడోసారి టైటిల్ చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాప్, రోడ్రిగ్స్ పోరాడినా ఫలితం లేకపోయింది. మూడు సీజన్లలో రెండోసారి టైటిల్ విజేతగా నిలిచిన ముంబై సంబురాల్లో మునిగిపోయింది.
IPL | ముంబై: డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ..ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(44 బంతుల్లో 66, 9ఫోర్లు, 2సిక్స్‌లు), నాట్‌సీవర్ బ్రంట్(30) రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 149/7 స్కోరు చేసింది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబైని కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. కాప్(2/11), జొనాసెన్(2/26), చరణి(2/43) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 141/9 స్కోరుకు పరిమితమైంది. మారిజానె కాప్(26 బంతుల్లో 40, 5ఫోర్లు, 2సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్(30) పోరాడారు. బ్రంట్(3/30) మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా, కెర్(2/25) రెండు వికెట్లు పడగొట్టింది. కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్: హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైని కాప్ ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. లీగ్‌లో సూపర్ ఫామ్‌మీదున్న మాథ్యూస్(3)ను కాప్ క్లీన్‌బౌల్డ్ చేసి ఢిల్లీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. వాబుల్ సీమ్‌ను సరిగ్గా అర్థం చేసుకోని మాథ్యూస్ తొలి వికెట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సీవర్ బ్రంట్..డబ్ల్యూపీఎల్‌లో వెయ్యి పరుగుల మార్క్ అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచింది. కాప్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన యస్తికా(8) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో ముంబై 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ తరుణంలో బ్రంట్‌కు కౌర్ జత కలువడం ఇన్నింగ్స్ గతిని మార్చేసింది.
పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై 2 వికెట్లకు 20 పరుగులు చేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ కౌర్, బ్రంట్ సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చరణి 9వ ఓవర్లో బ్రంట్ రెండు ఫోర్లతో దూకుడు కనబర్చగా, సదర్లాండ్ 10వ ఓవర్లో కౌర్ ఓ సిక్స్, ఫోర్‌తో తానేం తక్కువ కాదని చూపెట్టింది. జొనాసెన్ మరుసటి ఓవర్లోనైతే కౌర్ హ్యాట్రిక్ ఫోర్లతో దుమ్మురేపింది. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని కౌర్ 33 బంతుల్లో ఓ ఫోర్‌తో అర్ధసెంచరీ మార్క్ అందుకుంది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని చరణి విడగొట్టింది. దీంతో మూడో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా…కౌర్ జోరు తగ్గలేదు. జొనాసెన్ బౌలింగ్‌లో కెర్(2), సంజన(0) ఔటయ్యారు. వీరిని అనుసరిస్తూ సదర్లాండ్కు కౌర్ వికెట్ సమర్పించుకుంది. ఆఖర్లో బౌండరీలు రావడంతో ముంబైకి పోరాడే స్కోరు దక్కింది.
లక్ష్యఛేదనలో ఢిల్లీ పోరాడినా ఫలితం దక్కలేదు. మంచి ఫామ్‌మీదున్న కెప్టెన్ మెగ్ ల్యానిం గ్(13), షెఫాలీవర్మ(4) ఘోరంగా నిరాశపరిచారు. బ్రంట్ బౌలింగ్‌లో ల్యానింగ్ తొలి వికెట్‌గా వెనుదిరిగింది. మరోవైపు షెఫాలీ..ఇస్మాయిల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడంతో 17 పరుగులకు ఓపెనర్లు పెవిలియన్ చేరారు. జొనాసెన్(13), సదర్లాండ్(2) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో రోడ్రిగ్స్, కాప్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 22 పరుగులు జత చేశారు. ఇన్నింగ్స్ కుదురుకుంటున్న తరుణంలో రోడ్రిగ్స్ ఔట్ కావడంతో ఢిల్లీ అవకాశాలను దెబ్బతీసింది. ఆఖర్లో కాప్, నికీ ప్రసాద్(25 నాటౌట్) గెలిపించేందుకు ప్రయత్నం చేసినా ఢిల్లీ ఒడ్డున పడలేకపోయింది.
ఎమర్జింగ్ ప్లేయర్: అమన్జ్యోత్కౌర్
పర్పుల్ క్యాప్: అమెలియా కెర్ (18 వికెట్లు)
ఆరెంజ్ క్యాప్: సీవర్ బ్రంట్ (523 రన్స్)
విలువైన ప్లేయర్: బ్రంట్
ప్రైజ్‌మనీ: విజేత: ముంబై (6 కోట్లు)
రన్నరప్: ఢిల్లీ (3 కోట్లు)
ముంబై: 20 ఓవర్లలో 149/7(కౌర్ 66, బ్రంట్ 30, కాప్ 2/11, జొనాసెన్ 2/26),
ఢిల్లీ: 20 ఓవర్లలో 141/9(కాప్ 40, రోడ్రిగ్స్ 30, బ్రంట్ 3/30,కెర్ 2/25)