బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆ జట్టు ఆడిన నాలుగింట్లో మూడు మ్యాచ్‌లు గెలిచి ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌తో ఆర్సీబీపై ఉత్కంఠ విజయం సాధించిన యూపీ వారియర్స్.. ముంబైతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో పరాభవం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. గ్రేస్ హరీస్ (26 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వృందా దినేశ్ (33) ఆదుకోవడంతో 20 ఓవర్లలో 142/9 స్కోరు చేసింది. ముంబై బౌలర్లలో సీవర్ (3/18), సంస్కృతి గుప్తా (2/11), షబ్నమ్ ఇస్మైల్ (2/33) యూపీని కట్టడి చేశారు.
అనంతరం ఛేదనను ముంబై.. 17 ఓవర్లలోనే దంచేసింది. బంతితో అదరగొట్టిన సీవర్ (44 బంతుల్లో 75 నాటౌట్, 13 ఫోర్లు).. బ్యాట్‌తోనూ సత్తా చాటి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 59, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సీవర్‌కు అండగా నిలిచింది. బ్యాట్‌తో విఫలమైన యూపీ.. బంతితోనూ తేలిపోవడంతో ఆ జట్టుకు ఈ సీజన్లో మూడో ఓటమి తప్పలేదు.