Muhammad Asif : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ పోరు ఎంత ఆసక్తిగా, ఎంత హోరాహోరీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది దాయాది జట్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తలపడితే ఆ మజానే వేరు. 2007లో ఐసీసీ తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఆడాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా టైటిల్ పోరులో విజయం సాధించి కప్పు అందుకుంది. ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్ గురించి ఆసక్తికర విషయాన్ని పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అసిఫ్ పంచుకున్నాడు. 2007 వరల్డ్ కప్ ముఖ్యమైన జ్ఞాపకం ఏంటంటే.. ‘మిస్బాహుల్ హక్ ఆ షాట్ ఆడడం’ అని అసిఫ్ అన్నాడు.
‘ఆఖరి ఓవర్లో నేను మిస్బా దగ్గరకు వెళ్లి.. చాచు.. సిక్స్ కొట్టు అని చెప్పాను. కానీ, అతను తప్పుడు షాట్ ఆడాడు’ అని ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు. జోగిందర్ శర్మ బౌలింగ్‌లో స్కూప్ షాట్ ఆడిన మిస్బా చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. గాల్లోకి లేచిన బంతిని శ్రీశాంత్ ఒడుపుగా క్యాచ్ పట్టడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో, భారత ఆటగాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు.
దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన 2007 పొట్టి ప్రపంచకప్‌లో ఇండియా, పాక్ ఫైనల్ చేరాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. గౌతం గంభీర్ (75) టాప్ స్కోరర్. 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 141 రన్స్ వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అయితే… క్రీజులో ఉన్న మిస్బాహుల్ హక్ (43 పరుగులు) జట్టును గెలిపించినంత పని చేశాడు. హర్భజన్ సింగ్ వేసిన 18వ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టాడు. అయితే.. ఆఖరి ఓవర్లో ఐదు పరుగులు కావాల్సిన సమయంలో స్కూప్ షాట్ ఆడి ఔట్ అయ్యాడు. మహమ్మద్ ఆసిఫ్ 4 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ ఆలౌట్ కావడంతో ధోనీ సేన మొట్ట మొదటి టీ20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. మూడు కీలక వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. పాక్ ఆల్‌రౌండర్ షాహీద్ ఆఫ్రీదీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.