హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరోమారు ఆకట్టుకున్నాడు. ఇప్పటికే పలు ప్రముఖ పర్వతాలు అధిరోహించిన యశ్వంత్..తాజాగా ఒడిశాలో పెద్దదైన మౌంట్ దియోమలి(1,672మీటర్లు)ని అధిరోహించాడు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో అత్యంత ఎత్తైన 28 పర్వతాలతో పాటు ఏడు శిఖరాలను ఎక్కాలన్న లక్ష్యంతో యశ్వంత్ ముందుకు సాగుతున్నాడు.
ఇందులో భాగంగా ఇప్పటికే నార్త్ఈస్ట్లోని అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోంతో పాటు రాజస్థాన్, ఒడిశాలో పలు పర్వతాలను ఈ గిరిజన యువకుడు అధిరోహించాడు. దేశంలో సహస క్రీడలకు మరింత ప్రాచుర్యం కల్పించడంతో పాటు శారీరక ఫిట్నెస్, మానసిక సంసిద్ధతపై ఈ మహబూబాబాద్ కుర్రాడు కృషి చేస్తున్నాడు. శిఖరాలను ఎక్కిన ప్రతీసారి తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నాడు.