కోల్‌కతా : ఈనెల 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా దక్షిణాఫికాతో మొదలుకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తమకు చాలా కీలకమని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో ఈ సిరీస్ కీలకం కానుందని, సఫారీ సవాలుకు తాను సిద్ధంగా ఉన్నానని అతడు చెప్పాడు. సిరాజ్ మాట్లాడుతూ.. ‘ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్ మాకు కీలకం.
ప్రత్యర్థి జట్టు డిఫెండింగ్ చాంపియన్స్. పాకిస్థాన్‌తో సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుని వచ్చారు. అయితే మేం మా జట్టు ఫామ్‌పై సంతృప్తికరంగా ఉన్నాం. ఇంగ్లండ్‌లో రాణించాం. ఇటీవలే వెస్టిండీస్‌ను ఓడించాం’ అని తెలిపాడు. అగ్రశ్రేణి జట్లతో ఆడినప్పుడు తాను ఇంకా ఎలా మెరుగుపడాలనేదానిపై అవగాహన వస్తుందని.. సఫారీ సవాల్‌ను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు.