Moeen Ali : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మోయిన్ అలీ(Moeen Ali) ఇక ఫ్రాంచైజీ జట్లకు మాత్రమే ఆడనున్నాడు. యాషెస్ సిరీస్ హీరోగా, వరల్డ్ కప్ హీరోగా అతడు 10 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌ను ముగించాడు. ఇన్నేండ్ల తన క్రికెట్ ప్రయాణంలో తాను మెచ్చిన కెప్టెన్ల గురించి మోయిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మాజీ ఆల్‌రౌండర్ తాజాగా తాను చూసిన అత్యుత్తమ కెప్టెన్ పేరు చెప్పాడు. అలాగని అతడు ఇంగ్లండ్ మాజీ సారథుల్లో ఒకరిని ఎంచుకోలేదు. ఇంతకూ అలీ దృష్టిల్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరో తెలుసా.. ఇంకెవరు మన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).
ఇంగ్లండ్ జట్టు చిరస్మరణీయ విజయాల్లో భాగమైన మోయిన్ అలీ.. ‘అత్యుత్తమ కెప్టెన్ ఎవరు?’ అనే ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించలేదు. కచ్చితంగా అతడు ‘ఎంఎస్ ధోనీ’ అని ఠక్కున చెప్పాడు. ఇక ఇంగ్లండ్ సారథుల విషయానికొస్తే.. ‘ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) బెస్ట్ కెప్టెన్’ అని అలీ తెలిపాడు. ‘మోర్గాన్‌లో ఓ కెప్టెన్‌కు ఉండాల్సిన మంచి లక్షణాలన్నీ ఉన్నాయి.
అతడి నాయకత్వం బాగుంటుంది. మోర్గాన్ చాలా శక్తివంతమైనవాడు’ అని అలీ వెల్లడించాడు. ఇంగ్లండ్ వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2019) కలను నిజం చేసిన మోర్గాన్ కెప్టెన్సీలోనే అలీకి వన్డే, టీ20ల్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందుకని అతడిని బెస్ట్ కెప్టెన్‌గా ఎంచుకొని ఉంటాడని సమాచారం.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన మోయిన అలీ.. ధోనీని కెప్టెన్సీకి ఫిదా అయ్యాడు. ‘బౌలర్లను తెలివిగా ఉపయోగించడం, మ్యాచ్ ఆసాంతం ప్రశాంతంగా ఉండడం వంటి గుణాలున్న మహీ భాయ్ సారథ్యం చాలా బాగుంటుంద’ని అతడు కితాబు ఇచ్చాడు. అలీ 2021 నుంచి 2023 ఎడిషన్ వరకూ సీఎస్కే తరఫున ఆడాడు.
మోర్గాన్‌తో మోయిన్ అలీ
ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ అయిన మోయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 10 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు సెప్టెంబర్ 8, ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ హీరో అయిన మోయిన్ అలీఇకపై ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే కనిపించనున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అలీని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. దాంతో, ఇకపై మరో అవకాశం రావడం కష్టమనుకున్న అతడు వీడ్కోలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
పొట్టి ప్రపంచకప్(2022) ట్రోఫీతో..
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అలీ 2014లో అరంగేట్రం చేశాడు. 2015లో టెస్టు క్యాప్ దక్కించుకున్నాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సామర్థ్యంతో, స్పిన్‌తో మాయ చేయగల నైపుణ్యంతో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2019లో వన్డే వరల్డ్ కప్, 2022లో టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో మోయిన్ సభ్యుడు.
ఇంగ్లండ్ తరఫున 10 ఏండ్ల కెరీర్లో ఇప్పటివరకూ అతడు 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. బ్యాటుతో పాటు బంతితోనూ చెలరేగిపోయే అలీ ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్(Ashes Series) విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 336 వికెట్లు పడగొట్టాడు. ఈమధ్యే ముగిసిన టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో మోయిన్ అలీ ఆఖరిసారిగా ఇంగ్లండ్ జెర్సీ వేసుకున్నాడు. సెమీఫైనల్లో టీమిండియా (Team India) చేతిలో జోస్ బట్లర్ సేన ఓడిన విషయం తెలిసిందే.