Toll Tax | జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూళ్ల విషయమై మరో కీలక ముందడుగు పడింది. శాటిలైట్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ ఫీజు వసూలు విధానాన్ని కేంద్రం ఖరారు చేసింది. ఈ మేరకు 2008 నాటి నేషనల్ హైవేస్ ఫీజు నిబంధనలను సవరిస్తూ మంగళవారం కేంద్ర రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం టోల్ ప్లాజాల వద్ద కొత్తగా గ్లోబల్ నేవిగేసన్ శాటిలైట్ బేస్డ్ టోల్ పీజు విధానం అమల్లోకి వస్తున్నది. ఇప్పటికే అమల్లో ఉన్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి కొత్త విధానం అదనం కానున్నది.
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్తో కూడిన ఆన్ బోర్డ్ యూనిట్ గల వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు.. ఆ వాహనాలు ప్రయాణించిన దూరానికి టోల్ ఫీజు ఆటోమేటిక్గా పేమెంట్ అవుతుంది. ఈ వాహనాలకు టోల్ గేట్ల వద్ద సెపరేట్ లేన్లు ఏర్పాటు చేస్తారు. నావిగేషన్ డివైజ్ లేసి వెహికల్స్ కు సాధారణ టోల్ చార్జీలు వర్తిస్తాయి. ఇక జాతీయ రహదారులపై 20 కి.మీ వరకూ ‘జీరో టోల్ కారిడార్’ నిబంధన తీసుకొచ్చింది కేంద్రం. అంటే జాతీయ రహదారిపై 20 కి.మీ వరకూ టోల్ ఫీజు పే చేయనక్కర్లేదు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే.. ప్రయాణ దూరానికి అనుగుణంగా టోల్ ఫీజు చెల్లించాలి.