హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ ఖలీల్‌వాడి: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ.. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఇషాసింగ్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో గురువారం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్‌తో పాటు స్టార్ షూటర్ ఇషా సింగ్.. కవితను కలిశారు. జాతీయ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ పసిడి పతకం కైవసం చేసుకోవడం.. షూటింగ్లో ఇషాసింగ్ రజతం నెగ్గడంపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. ఇదే జోరు కొనసాగిస్తూ మరిన్ని పతకాలు నెగ్గాలని ఆకాంక్షించారు. వీరిద్దరి విజయాలు యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రోత్సాహం అందిస్తోందని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని అన్నారు