హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేళ సాట్స్ ఆధ్వర్యంలో ‘చలో మైదాన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో వేలాది మంది యువత, ప్లేయర్లు, క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు లక్ష మంది యువతతో ప్రతిజ్ఞ చేశారు. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగిన చలో మైదాన్ ముగింపు వేడుకలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘రాష్ట్ర యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాంపియన్లుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 17వేల క్రీడా ప్రాంగణాలను నిర్మించుకోవడంతో పాటు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించిన ప్లేయర్లకు భారీగా నగదు ప్రోత్సాహకాలతో పాటు విలువైన ఇంటి స్థలాలు అందజేస్తున్నాం.
క్రీడా ప్రాంగణాలన్నింటికీ త్వరలోనే కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తాం. దేశంలోనే అత్యుత్తమైన క్రీడావిధానాన్ని కూడా త్వరలో అమల్లోకి తీసుకొస్తాం. సాట్స్ ఆధ్వర్యంలో లక్ష మంది యువతను భాగస్వామ్యం చేస్తూ చలో మైదాన్ నిర్వహించడం అభినందనీయం’ అని అన్నారు. మరోవైపు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘అన్ని రంగాలు, సకల జనుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా చలో మైదాన్ యువ చైతన్య సభలు జరిగాయి. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. సీఎం నాయకత్వంతో భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో రాష్ట్ర ప్లేయర్లు పతకాల పంట పండించే రోజు వస్తుంది. సాట్స్ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళుతున్నది. 33 జిల్లా కేంద్రాల్లో యువతకు స్ఫూర్తినిచ్చే ర్యాలీలు, ఆటపాటలు, సభలతో దద్దరిల్లాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలచారి, రవికుమార్‌గౌడ్, సాట్స్ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.