Michael Vaughn : సుదీర్ఘ ఫార్మాట్లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వాళ్లలో విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం ప్రత్యేకం. టీ20ల కాలంలో తనదైన దూకుడుతో, సరదా వైఖరితో టెస్టులకు ఊపిరి పోసిన విరాట్ వీడ్కోలు వార్త అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. సమయం దొరికితే చాలు భారత ఆటగాళ్లపై నోరు పారేసుకొనే మైఖేల్ వాన్ (Michael Vaughn) సైతం కోహ్లీ రిటైర్మెంట్ను జీర్ణించుకోవడం లేదు. ‘ఇకపై విరాట్ తెలుపు జెర్సీలో కనిపించడు అనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నా. నా మనసుకెంతో బాధగా ఉంది’ అని వాన్ తెలిపాడు.
కోహ్లీ టెస్టుల నుంచి వైదొలగడం తనను నిరాశకు గురి చేసిందని టెలిగ్రాఫ్ పత్రికతో వాన్ అన్నాడు. అంతేకాదు తాను చూసిన వాళ్లలో అతడు గొప్ప ప్లేయర్ అని చెప్పాడీ ఇంగ్లండ్ మాజీ సారథి. ‘సాధారణంగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆటగాళ్ల గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కోహ్లీ రిటైర్మెంట్తో చాలా నిరాశ చెందాను.
Virat Kohli has retired from Tests and the tributes have been pouring in for an Indian cricket legend 👏🇮🇳💙
✍️ @MichaelVaughan pic.twitter.com/yvRSVNM51c
— Test Match Special (@bbctms) May 12, 2025
అతడు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ ఆడడనే విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఈ వేసవిలో ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీని చూడలేకపోతున్నందుకు మనసుకెంతో బాధగా ఉంది. మాకాలంలో 30 ఏళ్లకు పైగా టెస్టు కెరియర్ ఉండేది. కానీ, తక్కువ సమయంలోనే కోహ్లీ తన ముద్ర వేశాడు. అతడిలా టెస్టు క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాడు మరొకరు లేరు. అందుకే.. ఈ రన్‌మెషీన్ లేకుంటే ఐదు రోజుల ఆట చిన్నబోయినట్టు అనిపిస్తుంది’ అని వాన్ తెలిపాడు.
A few thoughts on Virat https://t.co/PCKckMnynJ
— Michael Vaughan (@MichaelVaughan) May 13, 2025
అంతేకాదు ఎంఎస్ ధోనీ (MS Dhoni) నుంచి కోహ్లీ టెస్టు పగ్గాలు అందుకున్నప్పుడు తాను ఆందోళన చెందానని వాన్ ఈ సందర్బంగా ప్రస్తావించాడు. దాదాపు పదేళ్ల క్రితం ధోనీ వారసుడిగా విరాట్ కెప్టెన్సీ చేపట్టాడు. టీమిండియాకు టెస్టు క్రికెట్ మీద ఆసక్తి లేదని అనపించింది. కానీ, నా అభిప్రాయం తప్పని కోహ్లీ నిరూపించాడు. అతడి సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు నమోదు చేసింది. సారథిగా, ఆటగాడిగా కోహ్లీ టెస్టులపై చెరగని ముద్ర వేశాడు. అందుకు కారణం.. సుదీర్ఘ ఫార్మాట్ అంటే అతడికి అంత పిచ్చి. కానీ, అతడి వీడ్కోలుతో టెస్టు క్రికెట్లో శూన్యత ఏర్పడనుంది. అతడిలా ఆటను ప్రేమించే ఆటగాడు దొరకడం కష్టమే అని వాన్ అన్నాడు.
రోహిత్, కోహ్లీలు అల్విదా పలకడంతో భారత జట్టుకు ఇంగ్లండ్ పర్యటన (England Tour) అతిపెద్ద పరీక్ష కానుంది. శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లపై బ్యాటింగ్ భారం పడనుంది. అందుకే కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సిరీస్‌కు పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఐపీఎల్లో దంచేస్తున్న సాయి సుదర్శన్, కరుణ్ నాయర్లు జట్టులో ఉండే అవకాశముంది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్‌తో టీమిండియా 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. 20వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.