Neeraj Chopra : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) వరుసగా టోర్నీల్లో బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే దోహా ‘డైమండ్ లీగ్’ (Daimond League)కు సిద్దమవుతున్న ఈ బడిసె వీరుడు పొలాండ్ దేశంలోనూ పోటీ పడనున్నాడు. ఈ సీజన్లో అతడికిది మూడో టోర్నీ కానుంది. ప్రస్తుతం డైమండ్ లీగ్ సన్నద్దతలో ఉన్న నీరజ్.. మే 23న జరుగబోయే 71వ ఒర్లిన్ జనుస్జ్ కుసోసిన్కీ మెమోరియన్ ఈవెంట్లోనూ ఈటెను విసరనున్నాడు.
ఆ తర్వాతి రోజున తన పేరిట నిర్వహించ తలపెట్టిన నీరజ్ చోప్రా క్లాసిక్ (NC Classic) టోర్నీని మొదలు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడీ ఒలింపిక్ విజేత. పొలాండ్ ఆతిథ్యమిస్తున్న 71వ ఒర్లిన్ జనుస్జ్ కుసోసిన్కీ మెమోరియన్ ఈవెంట్లో నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. రెండుసార్లు వరల్డ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్(గ్రెనెడా) సవాల్ విసిరేందుకు కాచుకొని ఉన్నాడు. అతడితో పాటు జులియన్ వెబర్ (జర్మనీ), పొలాండ్ స్టార్ మార్కిన్ క్రుకోవ్స్కీ, ఆ దేశానికే చెందిన సిప్రియన్ మేరిజ్గోల్డ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే.. నిరుడు ప్యారిస్ ఒలింపిక్స్‌లో చోప్రా రజత పతకంతో మెరవగా.. అండర్సన్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
మే 7వ తేదీ అనంతరం భారత్, పాకిస్తాన్ల ఉద్రికత్తల కారణంగా NC Classic 2025ను వాయిదా వేసిన నీరజ్.. దోహా డైమండ్ లీగ్ (Daimond League)లో బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో రెండు పతకాలు కొల్లగొట్టిన భారత స్టార్ .. ముచ్చటగా మూడోసారి టైటిల్‌పై గురి పెట్టాడు. మే 16న ఈ టోర్నీ మొదలవ్వనున్న ఈ పోటీల్లో బడిసె వీరుడితో పాటు భారత్‌కు చెందిన మరో ముగ్గురు పాల్గొననున్నారు.
జావెలిన్ త్రోలో కిశోర్ జెనా (Kishore Jena) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నిరుడు 9వ స్థానంతో నిరాశపరిచిన అతడు పతకంపై కన్నేశాడు. జాతీయ రికార్డు నెలకొల్పిన గల్వీర్ సింగ్ (Gulveer Singh) 5 వేల మీటర్ల పరుగులో.. మహిళల విభాగంలో పరుల్ చౌదరీ 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో బరిలోకి దిగుతున్నారు.