ఇస్లామాబాద్: సింధు జలాల ఒప్పందంపై (Indus treaty) మీ వైఖరిని పునఃపరిశీలించాలని భారత్‌ను పాకిస్థాన్ కోరింది. భారత్ నిర్ణయం తమ దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తుందని వాపోయింది. పాకిస్థాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పొరుగు దేశాల మధ్య కీలక జల భాగస్వామ్య ఒప్పందమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత్‌కు పాకిస్థాన్ విజ్ఞప్తి చేసింది. సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఇండియా టుడే టీవీ పేర్కొంది.
కాగా, 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌ను పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు కేటాయించింది. అయితే ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని చంపారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని పాకిస్థాన్ మానుకునే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.