పాల్వంచ, మే 14 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా అధికారులు దాన్ని పగులగొట్టి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో సంబంధిత అధికారులపై భగ్గుమన్నారు. దీంతో అధికారులు తప్పుని సరిదిద్దుకుని వేరే శంకుస్థాపన శిలాఫలాకాన్ని తయారు చేయించే పనిలో నిమగ్నమయ్యారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి ఒడ్డుగూడెం ప్రాంతంలోని ఓ గల్లీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం అభివృద్ధి పనులకు సంబంధించిన పాత శిలాఫలకాన్ని తొలగించి కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇదే ప్రాంతంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
నాడు ఏర్పాటు చేసిన దిమ్మెను, దానికి ఉన్న శిలాఫలకాన్ని తొలగించి ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మెప్పు కోసం తిరిగి అదే దిమ్మపై కొత్త శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చర్యను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా నిరసించాయి. శిలా ఫలకాన్ని మార్చని యెడల కొత్తగూడెం నియోజకవర్గం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని, మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పార్టీ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, దాసరి నాగేశ్వరరావు, శీలం సమ్మయ్య గౌడ్, కాల్వ ప్రకాశ్, కనగాల బాలకృష్ణ, బేతంశెట్టి విజయ్, ముత్యాల ప్రవీణ్, మధు చందు, ఏనుగుల శ్రీను, మండల అధ్యక్షుడు, మాజీ ప్రజా ప్రతినిధులు హెచ్చరించారు.
దీనిపై మున్సిపాలిటీ కమిషనర్ కె.సుజాతను నమస్తే తెలంగాణ ఫోన్లో సంప్రదించగా విచారణ చేపడతామని తెలిపారు. మున్సిపాలిటీ ఇన్చార్జి డీఈ మురళిని సంప్రదించగా గతంలో డెవలప్మెంట్ నిధుల కింద పనులు మంజూరు అయినట్లు, ఆ తర్వాత నిధులు లేక ఆపివేయడం జరిగిందని, పొరపాటున అదే శిలాఫలకంపై దీన్ని ఏర్పాటు చేసినట్లు, వెంటనే దాన్ని తొలగించి వేరే శిలాఫలకాన్ని వేరేచోట ఏర్పాటు చేస్తామని తెలిపారు.