Lionel Messi : అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi)కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్లు చెదిరే రీతిలో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించే అతడికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అందుకని అతను ఏ టోర్నీలో ఆడినా స్టేడియం నిండిపోతుంది. ఈమధ్యే ఇంటర్ మియామి క్లబ్( Inter Miami)కు మారిన మెస్సీ ఆట చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. అవును.. ఆగస్టు 6న మేజర్ లీగ్ సాకర్(Major League Soccer) తరఫున మెస్సీ తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు.
డల్లాస్ ఫుట్‌బాల్ క్లబ్(FC Dallas), మియామి జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కేవలం పది అంటే పదే నిమిషాల్లోనే మొత్తం టికెట్లు ఖతం అయ్యాయి.మెస్సీ రాకతో ఇంటర్ మియామి జట్టు రాత మారింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే గోల్ కొట్టిన ఈ స్టార్ ఫుట్‌బాలర్ జట్టును గెలిపించాడు. దాంతో, ప్రస్తుతం జరుగుతున్న లీగ్స్ కప్‌లో ఇంటర్ మియామి 16వ రౌండ్‌కు చేరింది.
లియోనల్ మెస్సీ
మెస్సీ అద్వితీయ ఆటతో మియామి జట్టు వరుసగా అట్లాంటా యునైటెడ్(Atlanta United), ఒర్లాండో సిటీ(Orlando City) జట్లపై విజయాలు నమోదు చేసింది. ఈ లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనే మెస్సీ ఐదు గోల్స్ చేయడం విశేషం.
ఎంబాపే(ఫ్రాన్స్), మెస్సీ
గత సీజన్లో పారిస్ సెయింట్ జర్మనీ క్లబ్(PSG club Germany)కు ఆడిన ఈ స్టార్ స్ట్రయికర్ రెండు నెలల క్రితం మియామితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన మెస్సీ నిరుడు అర్జెంటీనాకు వరల్డ్ కప్(fifa world cup 2022) అందించాడు. ఖతర్‌లో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై రెండు గోల్స్‌తో రాణించాడు. దాంతో, అర్జెంటీనా షూటౌట్లో 4-2తో గెలుపొంది మూడోసారి విశ్వవిజేతగా అవతరించింది.