Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ ఆరంభం నుంచి చర్చనీయాంశమైన సీన్ నది(Seine River)పై మరోమారు విమర్శలు చెలరేగాయి. అందరూ ఫిర్యాదు చేసినట్టే ఆ నదిలో కలుషితమైన నీరు(Polluted Water) ప్రవహిస్తోంది. దాంతో, ఏకంగా ఒలింపిక్స్ పోటీలనే నిర్వాహకులు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 30 మంగళవారం సీన్ నది వేదికగా పురుషుల ట్రయాథ్లాన్ (Triathlon) పోటీలు జరగాలి.
కానీ, సీన్ నదిలో బ్యాక్టీరియా చేరడంతో నీళ్లు మురికిగా మారాయి. దాంతో, ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని పోటీలను వాయిదా వేశారు. ‘పురుషుల ట్రయాథ్లాన్ పోటీలకు కొన్ని గంటల ముందు సీన్ నది నీళ్లలో కాలుష్యం తగ్గింది. కానీ, అప్పటికీ స్విమ్మర్లు ఈదడానికి అనుకూలమైన స్థాయి కంటే ఎక్కువగా కాలుష్యం ఉన్నట్టు గమనించాం. అందుకనే పోటీలను మరుసటి రోజుకు వాయిదా వేయాల్సి వచ్చింది’ అని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
జూలై 31 బుధవారం నాటికి సీన్లో కాలుష్యం తగ్గిపోయి, నీళ్లు తేటగా మారితే అక్కడే పోటీలు జరిపేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అదే రోజు ఉదయం 8 00 గంటలకు మహిళల ట్రయాథ్లాన్ పోటీలు ఉన్నాయి. దాంతో, బుధవారం రాత్రి 1030 గంటలకు పురుషుల పోటీలు నిర్వహించనున్నారు. ఒకవేళ బుధవారానికి కూడా సీన్ నదిలో బ్యాక్టీరియా మోతాదు తగ్గకుంటే పోటీలను శుక్రవారానికి వాయిదా వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.
సీన్ నదిలో కాలుష్యం ఉందని మెగా టోర్నీ ఆరంభం నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అవన్నీ పచ్చి అబద్దాలని పారిస్ నగర మేయర్ అన్నే హిడల్గో(Anne Hidalgo) కొట్టిపారేశారు. అంతేకాదు ఆ నీళ్లు సురక్షితంగా ఉన్నాయని చాటడం కోసం ఆమె ఏకంగా ఈత కూడా కొట్టారు. అనంతరం విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలను సైతం సీన్ నది లోనే నిర్వహించడం గమనార్హం.
సీన్ నదిలో ఈత కొడుతున్న అన్నే హిడల్గో