Wayanad | ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని మెప్పడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు (Landslides) విరిగిపడి.. సుమారు 89 మంది జలసమాధి అయ్యారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలే వరద ప్రవాహానికి తుడిచిపెట్టుకుపోయాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వందలాది మంది వలస కార్మికులు గల్లంతైనట్లు (labourers feared missing) తెలిసింది.
ఈ ప్రకృతి విలయానికి ముందక్కాయి (Mundakkai), చూరల్ మాలా (Chooralmala), అత్తమాల, నూల్పుజా గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, మందక్కాయి ప్రాంతంలోని విస్తారమైన టీ, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పలు రాష్ట్రాల నుంచి కార్మికులు తరలివస్తుంటారు. ఇలా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి 600 మంది కార్మికులు ముందక్కాయి ప్రాంతానికి వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. వీరంతా హారిసన్స్ మలయాళం ప్లాంటేషన్ లిమిటెడ్లో (Harrisons Malayalam Plantation Ltd) పనిచేస్తున్నారు. అయితే, కొండచరియలు విరిగిపడిన అనంతరం వారందరి ఆచూకీ కనిపించకుండా పోయింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడానికి తోడు మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయకపోవడంతో కార్మికులను చేరుకోలేకపోతున్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.
హెచ్ఎమ్ఎల్ జనరల్ మేనేజర్ బెనిల్ జాన్ మాట్లాడుతూ.. ‘మా కార్మికులతో ఇప్పటి వరకూ సంప్రదించలేకపోయాం. దీనికి తోడు మొబైల్ ఫోన్ నెట్వర్క్లు కూడా పనిచేయడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఆ ప్రాంతంలో 65 కుటుంబాలు నివసించే నాలుగు లైన్ ఇళ్లు విపత్తులో కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ కంపెనీకి చెందిన ఐదుగురు సిబ్బంది మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ఆ మృతదేహాలు కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ గిరీష్, ఆయన భార్య, మరో ముగ్గరు కార్మికులివిగా హారిసన్స్ మలయాళం లిమిటెడ్ జనరల్ మేనేజర్ సునీల్ జాన్ తెలిపారు. హెచ్ఎంఎల్ గ్రూపు ఆధ్వర్యంలోని సెంటినెల్ రాక్ ఎస్టేట్లోని తొమ్మిది మంది ఉద్యోగుల క్వార్టర్లు కూడా కొట్టుకుపోయాయినట్లు ఆయన వెల్లడించారు.
Also Read..
Wayanad | చూరల్ మాలా పట్టణం వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.. వీడియోలు
Wayanad Landslides | వయనాడ్ మృత్యు ఘోష.. నేడు, రేపు సంతాప దినాలుగా ప్రకటించిన కేరళ సర్కారు
MK Stalin | కేరళకు తమిళనాడు ప్రభుత్వం ఆపన్నహస్తం.. సీఎం నిధుల కింద రూ.5 కోట్లు విడుదల