Wayanad Landslides : వయనాడ్ ఘటన నేపథ్యంలో కేరళ సర్కారు ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఘటనలో మృతుల సంఖ్య 70 దాటిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది. వయనాడ్ జిల్లాలోని ముండక్కాయ్ గ్రామంపై ఇవాళ తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎడతెరపిలేని వర్షాల కారణంగా బండరాళ్ల మధ్య ఉన్న మట్టి కరిగిపోయి కొండ చరియలు జారిపడ్డాయి.
కొండ దిగువన ఉన్న నివాసాలను బండరాళ్లు, బురద కప్పేశాయి. దాంతో చాలామటుకు పడుకున్న వాళ్లు పడుకున్నట్టే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయపడుతున్నాయి. కాగా, ఇప్పటివరకు మృతుల సంఖ్య 84కు చేరిందని, క్షతగాత్రుల సంఖ్య 116కు చేరిందని కేరళ రెవెన్యూ మంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది.
ఘటనా ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను విడతల వారీగా పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన కారణంగా ఆవాసాలు కోల్పోయిన బాధితుల కోసం కేరళ ప్రభుత్వం పునరావాస ఏర్పాట్లు చేస్తున్నది.