Mehidy Hasan Miraz : బంగ్లాదేశ్ యువ క్రికెటర్ మెహిదీ హసన్ మిరాజ్(Mehidy Hasan Miraz) మాట నిలబెట్టుకున్నాడు. ఈమధ్య స్వదేశంలో చెలరేగిన అల్లర్లలో బలైన ఓ రిక్షా కార్మికుడి కుటుంబానికి ఆర్ధిక సాయం చేశాడు. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని బాధితుడి ఫ్యామిలీకి ఇచ్చి ఉదారత చాటుకున్నాడు. గురువారం మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చిన మిరాజ్.. రూ.5 లక్షల చెక్‌ను వాళ్లకు అందజేశాడు.
‘గత నెలలో ఆన్లైన్లో వైరల్ అయిన వీడియో నా కంటపడింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఆందోళనకరంగా మారి అల్లరిమూకల దాడిలో ఓ రిక్షా కార్మికుడు ప్రాణాలు విడిచాడు. అతడి కుమారుడు భోరున ఏడుస్తున్న ఆ వీడియో నన్ను ఆలోచనల్లో పడేసింది. ఆ సోదరుడి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నా. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వచ్చిన డబ్బును వాళ్లకు ఇచ్చేస్తానని పాకిస్థాన్‌లో ఉండగానే ప్రామిస్ చేశాను.
అనుకున్నట్టుగానే నిన్న రాత్రి నా మాట నిలబెట్టుకున్నా. బాధిత కుటుంబాన్ని కలిసి వాళ్లకు నా ప్రైజ్‌మనీ మొత్తాన్ని అప్పగించాను. ఇలా చేయడంతో చనిపోయిన వ్యక్తి లోటును పూడ్చలేనని తెలుసు. కానీ, వాళ్ల జీవితం ఎంతో కొంత సాఫీగా సాగేందుకు నా ప్రయత్నం ఉపయోగపడనుంది’ అని మిరాజ్ తెలిపాడు. సదరు రిక్షా కార్మికుడి కుటుంబంతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసిన అభిమానులు ‘మిరాజ్.. నీ ఆటే కాదు మనసు కూడా బంగారమే’ అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిరుడు భారత జట్టుపై సెంచరీతో చెలరేగిన మిరాజ్ బంగ్లాదేశ్ విజయాల్లో కీలకం అవుతున్నాడు. ఈమధ్యే ముగిసిన పాకిస్థాన్ పర్యటనలోనూ ఈ యువ ఆల్‌రౌండర్ అదిరే ప్రదర్శన చేశాడు. రెండు మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదడమే కాకుండా 77.50 సగటుతో 155 పరుగులు చేశాడు. అంతేకాదు 10 వికెట్లతో బంగ్లాదేశ్ చారిత్రాక సిరీస్ విజయంలో మిరాజ్ భాగమయ్యాడు.