Jaishankar | చైనాతో సంబంధాలు, సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడారు. చైనాతో దాదాపు 75శాతం సమస్యలు పరిష్కామయ్యాయని.. సరిహద్దుల్లో సైనికీకరణ పెరగడం పెద్ద సమస్యగా అభివర్ణించారు. జూన్ 2020లో గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను ప్రభావితం చేశాయన్నారు. సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని.. కొంత వరకు పురోగతి సాధించామని చెప్పారు.
బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు 75 శాతం పరిష్కారం అయ్యాయని తాను చెప్పగలనని.. చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించుకుంటే సంబంధాలు మెరుగుపడుతాయ్నారు. పరిష్కారం దొరికితే శాంతి, సామరస్యం నెలకొంటుందని.. ఆ తర్వాత ఇతర అవకాశాలను సైతం పరిశీలింవచ్చన్నారు. తూర్పు లడఖ్‌లోని పలుచోట్ల భారత్ – చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, రెండువైపులా విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల తర్వాత అనేక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో అమెరికాలో క్వాడ్ సమ్మిట్ జరుగుతుందని భావిస్తున్నామని, కాలం గడుస్తున్న కొద్దీ ఇండో-పసిఫిక్‌లోని చాలా ప్రాంతాల్లో విశ్వాసం పెరుగుతోందని జైశంకర్ పేర్కొన్నారు.