ICC Award : ప్రతిష్ఠాత్మక ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డులను యువ క్రికెటర్లు గెలుచుకున్నారు. ఏప్రిల్ నెలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా ఈ మెడల్ సాధించిన మూడో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడీ యంగ్‌స్టర్. మహిళల విభాగంలో స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరీన్ బ్రైసె(Kathryn Bryce) విజేతగా నిలిచిందని ఐసీసీ బుధవారం వెల్లడించింది.
స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌లో మిరాజ్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో అనూహ్య ఓటమి నుంచి తేరుకొని.. పర్యాటక జట్టును మట్టికరిపించడంలో మిరాజ్ కీలక పాత్ర పోషించాడు. విధ్వంసక సెంచరీకి తోడు 5 వికెట్లు తీసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ వఅవార్డు రేసులో నిలిచాడు. పేసర్ బ్లెస్సింగ్ ముజరబని(జింబాబ్వే), న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ల కంటే అత్యధిక ఓట్లతో విజేతగా నిలిచాడు.
మిరాజ్ కంటే ముందు బంగ్లా ఆటగాళ్లలో షకీబుల్ హసన్(Shaki Al Hasan), ముష్ఫికర్ రహీంలు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నారు. ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఏ క్రికెటర్‌కు అయినా ఐసీసీ అవార్డు గుర్తింపునిస్తుంది. ఓటింగ్ ఆధారంగా నాకు ఈ మెడల్ రావడం నాకెంతో సంతృప్తిని ఇస్తోంది’ అని మిరాజ్ సంబురంగా చెప్పాడు.
మహిళల విభాగంలో స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరిన్ బ్రసె అవార్డుకు ఎంపికైంది. మహిళల వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2025లో బ్యాటుతో, బంతితో రాణించింది. తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించింది. క్యాథరీన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 73.25 సగటుతో 293 రన్స్ చేసింది. ‘ఐసీసీ అవార్డు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకెంతో ప్రత్యేకం. ఉత్తమ క్రికెటర్లు అయిన ఫాతిమా సనా, హేలీ మాథ్యూస్లను వెనక్కి నెట్టి ఈ అవార్డు అందుకోవడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’ అని క్యాథరిన్ తెలిపింది.