నీలగిరి, మే 15 : కలెక్టరేట్ సమీకృత భవన సముదాయంలో సుమారు రూ.40 కోట్లతో 82 వేల చదరపు అడుగులతో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల వసతులతో అదనపు బ్లాక్ నిర్మాణం చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో నిర్మాణం చేసిన పాత భవనంలో కొన్ని శాఖలు మాత్రమే అందులో ఉన్నాయని డీఎంహెచ్ఓ, డీఈఓ వంటి పెద్ద శాఖలు బయట ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేగాక కార్యాలయంలో కేవలం 250 సీట్ల సామార్థ్యంతో సమావేశ మందిరం ఉండడం వల్ల సమీక్షా సమావేశాలకు, పెద్ద పెద్ద సమావేశాలకు హాల్ సరిపోవడం లేదన్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకుని రూ.40 కోట్లతో అదనపు బ్లాక్ ప్రభుత్వం మంజూరు చేయగా గత నెల 28న ఉమ్మడి జిల్లా మంత్రులు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. జీ ప్లస్ టూ విధానంలో నిర్మాణం కొనసాగనున్నట్లు వెల్లడించారు. 8 నుంచి 10 నెలల్లో భవనాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్ కుమార్, ఇన్చార్జి డీఆర్ఓ వై.ఆశోక్‌రెడ్డి, ఆర్అండ్బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర్రావు, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈఈ ఫణిజా, గణేశ్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్, డీపీఓ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Nalgonda : సకల సదుపాయాలతో అదనపు బ్లాక్ నిర్మాణం : కలెక్టర్ ఇలా త్రిపాఠి