Duddilla Sridhar Babu | పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): అకాల వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం పూర్తి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
అకాల వర్షాల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న పంట వివరాలను సేకరించి రైతులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం పై నివేదిక అందించాలని మంత్రి వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకాల వర్షాల కారణంగా ఏ రైతు నష్టపోకుండా ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తుందని రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.