Ranji Trophy 2024: టీమిండియా ఆటగాడు, దేశవాళీలో కర్నాటక రంజీ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. వారం రోజుల క్రితం అగర్వాల్.. త్రిపురతో మ్యాచ్ ముగించుకుని విమానంలో సూరత్ వస్తుండగా కలుషిత నీరు తాగడంతో నోరు, గొంతులో మంట కారణంగా హుటాహుటిన ఆస్పత్రికి చేరిన విషయం విదితమే. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మయాంక్.. రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగబోయే మ్యాచ్‌లో ఆడనున్నట్టు సమాచారం.
రంజీ ట్రోఫీలో భాగంగా కర్నాటక జట్టు.. శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి చెన్నై వేదికగా తమిళనాడుతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు మయాంక్ అందుబాటులో ఉండనున్నాడని కర్నాటక క్రికెట్ టీమ్ వర్గాలు తెలిపాయి. అగర్వాల్ గైర్హాజరీలో కర్నాటక జట్టుకు రైల్వేస్‌తో సూరత్‌లో ముగిసిన మ్యాచ్‌లో నికిన్ జోస్ సారథిగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో కర్నాటక ఒక్క వికెట్ తేడాతో గెలిచింది.
With my happy pill, recovery is faster ❣️ pic.twitter.com/dJ26tGlIHj
— Mayank Agarwal (@mayankcricket) February 2, 2024
ప్రస్తుతం గ్రూప్ సి లో ఉన్న తమిళనాడు ఖాతాలో 21 పాయింట్లు ఉండగా కర్నాటక కూడా అన్నే పాయింట్లతో ఉంది. అయితే నెట్ రన్ రేట్ కారణంగా కర్నాటక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తమిళనాడు, కర్నాటకలు మూడింటిలో గెలిచి ఒకదాంట్లో ఓడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయి.