బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన ఆఖరి పోరులో వరుణుడిదే పైచేయి అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి, ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో పోరులో ఆసీస్ గెలిచింది. పుంజుకుని పోటీలోకి వచ్చిన టీమ్ఇండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం దక్కించుకుంది. యాషెస్ సిరీస్‌కు ముందు సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుందామనుకున్న కంగారూల ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. యాషెస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)..ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ లాంటి కీలక ప్లేయర్లను తప్పించింది. ఐదో పోరు విషయానికొస్తే..తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
సిరీస్‌లో సూపర్ ఫామ్‌మీదున్న ఓపెనర్ అభిషేక్‌శర్మ(13 బంతుల్లో 23 నాటౌట్, ఫోర్, సిక్స్), వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16 బంతుల్లో 29 నాటౌట్, 6ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ అభిషేక్, గిల్ బౌండరీల మోత మోగించారు. డ్వారిషెస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అభిషేక్ దంచుడు మొదలుపెట్టాడు. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్ విడిచిపెట్టడంతో లైఫ్ దక్కింది. ఇదే అదనుగా రెచ్చిపోయిన అభిషేక్ మరుసటి బంతిని బౌండరీ పంపించి తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఇక సిరీస్‌లో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న గిల్..డ్వారిషెస్ మూడో ఓవర్లో విశ్వరూపం ప్రదర్శించాడు. గత మ్యాచ్‌లో చేసిన తప్పును తిరిగి పునరావృతం చేయద్దన్న ఉద్దేశంతో గిల్..డ్వారిషెస్ను ఉతికి ఆరేస్తూ కండ్లు చెదిరే రీతిలో నాలుగు బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు.
ఒక్కో షాట్ ఒక్కో రీతిని ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో అభిషేక్ మరోమారు ఔట్ నుంచి తప్పించుకున్నాడు. నాథన్ ఎలిస్ నాలుగో ఓవర్లో అభిషేక్ ఇచ్చిన క్యాచ్ మిస్ కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతిని అభిషేక్ ప్లాట్ సిక్స్ కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో తొలుత ఉరుములు, మెరుపులతో మొదలై గబ్బా స్టేడియాన్ని భారీ వర్షంతో ముంచెత్తింది. ఎడతెరిపిలేని వానతో మైదానం మొత్తం తడిసిముద్దయింది. ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా తరఫున కెప్టెన్ సూర్యకుమార్ ట్రోఫీని అందుకున్నాడు. 163 పరుగులు చేసిన అభిషేక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.

స్వదేశానికి గిల్, బుమ్రా
కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్‌గిల్‌తో పాటు బుమ్రా ఆదివారం స్వదేశానికి చేరుకోనున్నారు. ఈనెల 14 నుంచి కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రెండు జట్ల మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. ఇందు కోసం ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న టెస్టు ప్లేయర్లు గిల్, బుమ్రా, వాషింగ్టన్ సుందర్, అక్షర్‌పటేల్…ఆదివారం సాయంత్రానికి కోల్‌కతా చేరుకోనున్నారు. శనివారం భారత్, ఆసీస్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్లేయర్లు హోటల్ రూమ్లకే పరిమితమయ్యారు. టెస్టు జట్టులో లేని ప్లేయర్లు బ్యాచ్‌లు, బ్యాచ్‌లుగా స్వదేశానికి చేరుకోనున్నారు. మరోవైపు భారత్ ‘ఏ’తో బెంగళూరులో అనధికారిక టెస్టు ఆడుతున్న దక్షిణాఫ్రికా ‘ఏ’ టీమ్‌లోని కొంత మంది సభ్యులు కోల్‌కతా రానున్నారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 4.5 ఓవర్లలో 52/0 (గిల్ 29 నాటౌట్, అభిషేక్ 23 నాటౌట్)