శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Sep 14, 2020 , 02:02:12

రైజింగ్‌ షో లక్ష్యంగా..బరిలోకి హైదరాబాద్‌

రైజింగ్‌ షో లక్ష్యంగా..బరిలోకి హైదరాబాద్‌

  • Dream11 IPL 5రోజుల్లో
  • మొదట బ్యాటింగ్‌ చేస్తే.. ఓపెనర్లు దంచికొట్టడం.. 
  • ఫీల్డింగ్‌ చేయాల్సివస్తే.. బౌలర్లు రెచ్చిపోవడం..
  • స్వల్ప స్కోర్లను సైతం కాపాడుకోగలగడం.. 
  • ఇవన్నీ కలగలిపితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.

లీగ్‌లోకి లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌ అన్నట్లు నిలకడైన ప్రదర్శనతో ఆడిన ఏడు సీజన్లలో రైజర్స్‌ ఐదుసార్లు ప్లేఆఫ్స్‌ చేరింది. అందులో ఓసారి చాంపియన్‌గా మరోసారి రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌.. యూఏఈ గడ్డపై దుమ్మురేపేందుకు సిద్ధమైంది. లాక్‌డౌన్‌లో తెలుగు పాటలకు స్టెప్పులేసి మనవాళ్లను ఉర్రూతలూగించిన వార్నర్‌.. దుబాయ్‌లో కప్పుకొట్టి తీన్‌మార్‌ వేయాలని ఆశిద్దాం! 

హైదరాబాద్‌ బిర్యానీ ఎంత ఫేమసో.. సన్‌రైజర్స్‌ ఓపెనింగ్‌ జోడీ కూడా అంతే ఫేమస్‌. ఒకవైపు బెయిర్‌స్టో వీరబాదుడు బాదితే.. మరో ఎండ్‌ నుంచి వార్నర్‌ ఊచకోత కోస్తాడు. ప్రస్తుతం క్రికెట్‌లో మరే జట్టుకు ఇలాంటి ఓపెనర్లు లేరంటే అతిశయోక్తి కాదు. హెడ్‌కోచ్‌గా ట్రెవర్‌ బెయిలిస్‌, మెంటార్లుగా ముత్తయ్య మురళీధరన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సహాయకోచ్‌ హడిన్‌ ఇలా ఎటుచూసినా దిగ్గజాలు అందుబాటులో ఉన్న రైజర్స్‌ ఈసారి కూడా ప్లేఆఫ్స్‌ చేరడం పక్కాగానే కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న రైజర్స్‌..

అందులో ఒకసారి (2016) టైటిల్‌ చేజిక్కించుకోగా.. మరోసారి (2018) రన్నరప్‌గా నిలిచింది. మూడుసార్లు (2013, 2017, 2019) ప్లేఆఫ్స్‌కు చేరింది. రెండు సార్లు (2014, 2015) మాత్రం లీగ్‌దశలోనే వెనుదిరిగింది. మిడిలార్డర్‌ లోపాలు సరిదిద్దుకొని.. ఒత్తిడిని అధిగమిస్తే రైజర్స్‌కు తిరుగుండదు. బాల్‌ట్యాంపరింగ్‌ ఉదంతం వల్ల నిషేధానికి గురైన వార్నర్‌ ఆ తర్వాత నుంచి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 21వ తేదీన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో వార్నర్‌ సేన తొలి మ్యాచ్‌ ఆడనుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా తొలి మ్యాచ్‌కు వార్నర్‌, బెయిర్‌స్టో అందుబాటులో ఉండటం లేదు

పాండేపైనే భారం..

ఇటీవలి కాలంలో టీమ్‌ఇండియా తరఫున నిలకడగా ఆడుతున్న మనీశ్‌ పాండే అదే జోరు కొనసాగిస్తే రైజర్స్‌కు తిరుగుండదు. భీకరమైన ఓపెనింగ్‌ జోడీతో పాటు కేన్‌ విలియమ్సన్‌ అందుబాటులో ఉన్నా.. దేశవాళీ అగ్రశ్రేణి ఆటగాడి లోటు కనిపిస్తున్నది. ఆ స్థానాన్ని పాండే భర్తీ చేస్తే.. రైజర్స్‌ కష్టాలు తీరినట్లే.  యువ భారత సారథి గార్గ్‌ ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి. హైదరాబాదీ క్రికెటర్‌ బవనక సందీప్‌..తన ఆల్‌రౌండర్‌ పాత్ర ఎలా పోషిస్తాడన్నది ఆసక్తికరం. ఎంత చిన్న లక్ష్యాన్ని అయినా కాపాడుకోవడంలో రైజర్స్‌ దిట్ట అని చెప్పొచ్చు. ఈసారి రషీద్‌ఖాన్‌ ఏం మాయ చేస్తాడో చూడాలి.




logo