కౌలాలంపూర్: నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన తెలుగమ్మాయి పీవీ సింధు మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-14, 22-20తో సంగ్ షువో యున్ (చైనీస్ తైఫీ)పై గెలిచింది. కాలిగాయం కారణంగా ఆటకు దూరమైన సింధు.. రీఎంట్రీలో ఎలాంటి ఇబ్బందిలేకుండా దూకుడుగా ఆడింది.
రెండో రౌండ్లో ఆమె ప్రపంచ 9వ ర్యాంకర్ టొమొక మియజకి (జపాన్)తో తలపడనుంది. ఇక పురుషుల డబుల్స్‌లో మాజీ ప్రపంచ నంబర్‌వన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. 21-13, 21-15తో యాంగ్ పొ-హువాన్, లీ జె-హె (చైనీస్ తైఫీ) జోడీని ఓడించింది. 35 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రత్యర్థిని చిత్తుచేసిన భారత జంట.. క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తనీషా క్రాస్టో.. 15-21, 21-18, 15-21తో ప్రెస్లీ స్మిత్, జెన్నీ గై (అమెరికా) చేతిలో ఓడారు. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ కూడా తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు.