కాజీపేట, జనవరి 16 : హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్‌షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పురుషుల తుది పోరులో ఇండియన్ రైల్వేస్ టీమ్ 26-21తో మహారాష్ట్రపై ఉత్కంఠ విజయం సాధించింది. కొల్లాపూర్, ఒడిశా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు మహిళల ఫైనల్లో మహారాష్ట్ర 23-22తో ఒడిశాను ఓడించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జట్లు ఆ తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి.
చాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మక ఏకలవ్య అవార్డుతో పాటు బెస్ట్ ఆల్‌రౌండర్ పురస్కారాన్ని రాంజీ కశ్యప్ (రైల్వేస్), రాణీలక్ష్మి అవార్డు సహ బెస్ట్ ఆల్‌రౌండర్‌ను సంధ్య, సుర్వసే (మహారాష్ట్ర) అందుకున్నారు. బెస్ట్ డిఫెండర్లుగా ప్రతీక్ వైకర్ (మహారాష్ట్ర), అర్చన ప్రధాన్ (ఒడిశా), బెస్ట్ అటాకర్లుగా అభినందన్ పాటిల్ (రైల్వేస్), ప్రియాంక ఇంగ్లే (మహారాష్ట్ర) అవార్డులు అందుకున్నారు.
ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు భంవార్ సింగ్, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్కార్సింగ్, ఫెడరేషన్ టోర్నమెంట్ చైర్మన్ త్యాగి, ఫెడరేషన్ ఎథిక్స్ కమిషన్ చైర్మన్, తెలంగాణ ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలంగాణ, వరంగల్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, శ్యాంప్రసాద్, టెక్నికల్ అఫీషియల్ సురేంద్ర వీరికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.