Zaheer Khan | కోల్‌కతా: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీకి మెంటార్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఎల్ఎస్జీ బుధవారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా.. జహీర్‌కు జెర్సీని అందజేస్తూ జట్టులోకి ఆహ్వానించారు.
అంతకుముందే ఎల్ఎస్జీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయాన్ని తెలిపింది. 2022, 2023 సీజన్లలో గౌతం గంభీర్ లక్నోకు మెంటార్‌గా పనిచేయగా 2024లో అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వెళ్లి అటు నుంచి నేరుగా భారత క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్ అయ్యాడు. లక్నో మెంటార్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ బాధ్యతలనూ జహీర్ చూసుకోనున్నాడు. లాన్స్ క్లూసెనర్, ఆడమ్ వోగ్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉండనున్నారు.