IPL | ముంబై : ఐపీఎల్లో మరోపోరు అభిమానులను అలరించింది. శుక్రవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. గెలుపు దోబూచులాడిన మ్యాచ్‌లో చివరికి లక్నోనే లక్ వరించింది. తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60, 9ఫోర్లు, 2సిక్స్‌లు), మార్క్రమ్ (38 బంతుల్లో 53, 2ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(5/36) ఐదు వికెట్లతో విజృంభించాడు. ఐపీఎల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ కొత్త రికార్డు నెలకొల్పాడు. లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. సూర్యకుమార్‌యాదవ్(43 బంతుల్లో 67, 9ఫోర్లు, సిక్స్), నమన్ ధీర్(24 బంతుల్లో 46, 4ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించారు. శార్దుల్, ఆకాశ్, అవేశ్, దిగ్వేశ్ ఒక్కో వికెట్ తీశారు. దిగ్వేశ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
204 పరుగుల లక్ష్యఛేదనలో ముంబైకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు విల్‌జాక్స్(5), రికల్టన్(10) ఘోరంగా విఫలమయ్యారు. ఈ తరుణంలో నమన్ధీర్, సూర్యకుమార్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరు పసలేని లక్నో బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. నమన్ధీర్ అయితే కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న తరహాలో వీరవిహారం చేశాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన దిగ్వేశ్.. నమన్‌ను ఔట్ చేయడంతో ముంబై తడబడింది. అయితే సూర్యకుమార్ ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచాడు. తిలక్‌వర్మ(25 రిటైర్డ్ ఔట్) అండతో సూర్యకుమార్ లక్నో బౌలర్ల భరతం పట్టాడు. తనదైన శైలిలో షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించాడు. తన ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు, సిక్స్ కొట్టిన సూర్యకుమార్.. అవేశ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే 19వ ఓవర్లో తిలక్‌ను రిటైర్డ్ ఔట్‌గా రప్పించిన ముంబై.. సాంట్నర్(2 నాటౌట్)కు చాన్స్ ఇచ్చింది. కానీ ఆఖర్లో అవేశ్ అద్భుతం చేశాడు. ఆరు బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో 9 పరుగులు ఇచ్చిన అవేశ్..లక్నోకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
పాండ్యా పటాకా : మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్..లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్మ్ లక్నోకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ వీరిద్దరు ఆది నుంచే ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకున్నారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతికి మార్ష్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్యాట్‌కు తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించినా..ముంబై డీఆర్ఎస్కు వెళ్లకపోవడం మార్ష్‌కు కలిసివచ్చింది. ఇదే అదనుగా దీపక్ చాహర్ రెండో ఓవర్లో మార్క్మ్ ఫోర్ కొడితే..మార్ష్ రెండు ఫోర్లతో చెలరేగాడు. వీరి దూకుడైన బ్యాటింగ్‌తో స్కోరుబోర్డు ఊపందుకుంది. అశ్వనీ కుమార్ 6వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో మార్ష్ 27 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది.
ఇక లాభం లేదనుకుని యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతుర్‌ను తీసుకురావడం ముంబైకి కలిసొచ్చింది. డ్రైవ్ ఆడబోయిన మార్ష్..విఘ్నేశ్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మార్ష్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పూరన్(12) సిక్స్, ఫోర్‌తో జోరు ప్రదర్శించాడు. 9వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా..పూరన్‌ను బోల్తా కొట్టించాడు. స్లో బౌన్సర్‌ను ఆడే క్రమంలో చాహర్ చేతికి చిక్కాడు. ఇప్పుడు ఇక తన వంతు అంటూ కెప్టెన్ పంత్(2)..పాండ్యాకు వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో మార్క్మ్,్ర ఆయూశ్ బదోని(30) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. మార్క్మ్ సహకారంతో బదోనీ బౌండరీలతో చెలరేగడంతో 14వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. అశ్వని బౌలింగ్‌లో బదోని ఔట్ కాగా, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్క్మ్.్ర.హార్దిక్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌కు దిగిన హార్దిక్ వరుస బంతుల్లో మిల్లర్(27), ఆకాశ్‌దీప్(0)ను ఔట్ చేశాడు. మధ్యలో ఒకింత నెమ్మదించిన లక్నో ఇన్నింగ్స్…మార్క్మ్,్ర బదోనీ, మిల్లర్ ఇన్నింగ్స్‌తో 200 పరుగుల మార్క్ అందుకుంది.
1 ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు.
లక్నో : 20 ఓవర్లలో 203/8(మార్ష్ 60, మార్క్మ్ 53, పాండ్యా 5/36, బౌల్ట్ 1/28),
ముంబై : 20 ఓవర్లలో 191/5(సూర్యకుమార్ 67, నమన్ 46, దిగ్వేశ్ 1/21, శార్దుల్ 1/40)