పీఎల్‌లో విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తాజా సీజన్లో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతుంటే..
లీగ్‌లో కొత్తగా వచ్చిన జట్లు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. గుజరాత్ ఇప్పటికే పాయింట్ల పట్టిక టాప్‌లో కొనసాగుతుంటే.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఆరో విజయంతో మూడో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం ‘లో స్కోరింగ్’ మ్యాచ్‌లో పట్టుదల ప్రదర్శించిన లక్నో.. పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసింది.
పుణె: బౌలర్ల హవా కొనసాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తాచాటింది. డికాక్, హుడా రాణించడంతో మొదట పోరాడే స్కోరు చేసిన లక్నో.. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను కట్టడి చెసింది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది. తాజా సీజన్లో లక్నోకు ఇది ఆరో విజయం కాగా.. పంజాబ్ ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (34; ఒక ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు.
వీరిద్దరి ధాటికి ఒక దశలో 98/1తో పటిష్టంగా కనిపించిన లక్నోను.. రబడ (4/38), రాహుల్ చాహర్ (2/30) దెబ్బ కొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (6), ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (7), మార్కస్ స్టొయినిస్ (1), ఆయుశ్ బదోనీ (4), హోల్డర్ (11) విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకు పరిమితమైంది. బెయిర్‌స్టో (32; 5 ఫోర్లు), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగిలినవాళ్లు కనీస పోరాటం చూపలేకపోయారు. లక్నో బౌలర్లలో మొహసిన్ ఖాన్ 3, కృనాల్ పాండ్యా, చమీరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్‌తో బెంగళూరు, రాజస్థాన్‌తో ముంబై తలపడనున్నాయి.
రఫ్పాడించిన రబడ..
తాజా సీజన్లో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను.. పంజాబ్ బౌలర్లు సమర్థవంతంగా అడ్డుకున్నారు. అర్శ్‌దీప్ సింగ్ (0/23), సందీప్ శర్మ (1/18) కట్టుదిట్టమైన బంతులతో విజృంభించడంతో పరుగులు రాబట్టేందుకు లక్నో తీవ్రంగా శ్రమించింది. రెండు సెంచరీలతో జోరుమీదున్న కెప్టెన్ లోకేశ్ రాహుల్ 6 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, దీపక్ హుడా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పంజాబ్ బౌలర్లు పకడ్బందీ బంతులేస్తున్నా.. అడపా దడపా బౌండ్రీలు రాబట్టిన ఈ జోడీ రన్‌రేట్‌ను పడిపోకుండా చూసుకుంది. రెండో వికెట్‌కు 85 పరుగుల జోడించాక డికాక్‌ను సందీప్ శర్మ బుట్టలో వేసుకోగా.. బెయిర్‌స్టో వేసిన మెరుపు త్రోకు దీపక్ హుడా రనౌటయ్యాడు. కృనాల్ పాండ్యా, ఆయుశ్ బదోనీ, మార్కస్ స్టొయినిస్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఒక దశలో 98/1తో పటిష్టంగా కనిపించిన లక్నో.. 111/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖర్లో చమీరా (17; 2 సిక్సర్లు), మొహసిన్ ఖాన్ (13 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) కాస్త ధాటిగా ఆడటంతో లక్నో పోరాడే స్కోరు చేయగలిగింది.
స్కోరు బోర్డు
లక్నో: డికాక్ (సి) జితేశ్ (బి) సందీప్ 46, రాహుల్ (సి) జితేశ్ (బి) రబడ 6, దీపక్ హుడా (రనౌట్/బెయిర్‌స్టో) 34, కృనాల్ (సి) ధవన్ (బి) రబడ 7, స్టొయినిస్ (సి అండ్ బి) రాహుల్ చాహర్ 1, బదోనీ (సి) లివింగ్‌స్టోన్ (బి) రబడ 4, హోల్డర్ (సి) సందీప్ (బి) రాహుల్ చాహర్ 11, చమీరా (సి) రాహుల్ చాహర్ (బి) రబడ 17, మోహసిన్ ఖాన్ (నాటౌట్) 13, అవేశ్ ఖాన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 153/8. వికెట్ల పతనం: 1-13, 2-98, 3-104, 47-105, 5-109, 6-111, 7-126, 8-144, బౌలింగ్: అర్శ్‌దీప్ 4-0-23-0, సందీప్ 4-0-18-1, రబడ 4-0-38-4, రిషీ ధవన్ 2-0-13-0, లివింగ్‌స్టోన్ 2-0-23-0, రాహుల్ చాహర్ 4-0-30-2.
పంజాబ్: మయాంక్ (సి) రాహుల్ (బి) చమీరా 25, ధవన్ (బి) బిష్ణోయ్ 6, బెయిర్‌స్టో (సి) కృనాల్ (బి) చమీరా 32, రాజపక్స (సి) రాహుల్ (బి) కృనాల్ 9, లివింగ్‌స్టోన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 18, జితేశ్ (ఎల్బీ) కృనాల్ 2, రిషి ధవన్ (నాటౌట్) 21, రబడ (సి) బదోనీ (బి) మొహసిన్ 2, రాహుల్ చాహర్ (సి) బదోనీ (బి) మొహసిన్ 4, అర్శ్‌దీప్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం: 20 ఓవర్లలో 133/8, వికెట్ల పతనం: 1-35, 2-46, 3-58, 4-88, 5- 92, 6-103, 7-112, 8-117, బౌలింగ్: మొహసిన్ ఖాన్ 4-1-24-3, చమీరా 4-0-17-2, హోల్డర్ 1-0-8-0, అవేశ్ 3-0-26-0, రవి బిష్ణోయ్ 4-0-41-1, కృనాల్ 4-1-11-2.