IPL : ఐపీఎల్ 19వ సీజన్‌కు ముందే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఫ్రాంచైజీలు పాత కోచింగ్ సిబ్బందిని వదిలించుకోవడమే ఆలస్యం కొన్ని జట్లు వాళ్లతో ఒప్పందానికి సిద్ధమవుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో తెగతెంపులు చేసుకున్న భరత్ అరుణ్(Bharat Arun) లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కోచ్‌గా నియమితులయ్యాడు. మూడేళ్లుగా కోల్‌కతా బౌలింగ్ దళాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) టీమ్‌తో కలుస్తాడనే వార్తలు నెట్టింట వైరలయ్యాయి.
కానీ, తెలివిగా పావులు కదిపిన సంజీవ్ గొయెంకా బృందం ఆయనతో ఒప్పందం చేసుకుంది. దాంతో, ప్రస్తుతం బౌలింగ్ కోచ్‌గా ఉన్న వరల్డ్ కప్ హీరో జహీర్ ఖాన్‌ను లక్నో వదిలించుకోనుందని తెలుస్తోంది. ఇక .. భరత్ విషయానికొస్తే రెండేళ్ల పాటు ఆయన ఎల్ఎస్జీతో కొనసాగుతాడని సమాచారం. పద్దెనిమిదో సీజన్ ముందు జహీర్ ఖాన్‌తో లక్నో ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. జహీర్ నేతృత్వంలో లక్నో పేస్ యూనిట్ గొప్పగా రాణించలేకపోయింది.
🚨 Lucknow Super Giants have roped in Bharat Arun as bowling coach. He joins LSG after a four-year stint with KKR pic.twitter.com/1LPXYy0xm1
— Cricbuzz (@cricbuzz) July 30, 2025
పేసర్ల వైఫల్యంతో ప్రత్యర్థులకు భారీ స్కోర్లు సమర్పించుకున్న ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ కోచ్‌గా ఈ యార్కర్ కింగ్ కాంట్రాక్టును పొడిగించడానికి సంజీవ్ గొయెంకా టీమ్ సిద్ధంగా లేదు. అందుకే.. అతడి స్థానంలో భరత్ అరుణ్‌ను నమ్ముకోవడమే మంచిదని లక్నో భావించింది. వచ్చే ఏడాది జరుగబోయే 19వ సీజన్లో అరుణ్ ఆధ్వర్యంలో తమ బౌలింగ్ దళం గొప్పగా రాణిస్తుందని లక్నో యాజమాన్యం భావిస్తోంది.
Zaheer Khan brings with him a winning mentality, an unrivalled awareness of the game, and a fierce desire to win, which aligns perfectly with the #LSG ethos. His presence as the mentor is a perfect match with our ambitions.
Welcome to the family, Zaheer! #ZaheerNowSuperGiant pic.twitter.com/71lY9ZWYCY
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) August 28, 2024
భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా సుదీర్ఘ అనుభవం, మంచి ట్రాక్ రికార్డు కలిగిన భరత్.. రెండు దఫాలు భారత జట్టుకు సేవలందించారు. మొదటిసారి 2014 -15 వరకూ బౌలింగ్ దళాన్ని నడిపించిన ఆయన.. రెండో పర్యాయం 2017 జూలై 16 నుంచి 2021 పొట్టి ప్రపంచ కప్ వరకూ కోచ్‌గా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే స్పీడ్స్టర్లు జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్‌లు రాటుదేలారు.