న్యూఢిల్లీ: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ..భారత్‌లో హైదరాబాద్ పర్యటన అధికారికంగా ఖరారైంది. ‘జీవోఏటీ టూర్ టు ఇండియా 2025’లో భాగంగా మెస్సీ వచ్చే నెలలో భారత్‌కు రాబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్వాహకులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో హైదరాబాద్ సహా కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో మెస్సీ పర్యటించనున్నాడు. టూర్లో తొలుత కోల్‌కతాకు వెళ్లనున్న ఈ అర్జెంటీనా సాకర్ స్టార్ ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో అభిమానులను అలరించనున్నాడు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని మెస్సీ కలిసే అవకాశముంది.
ఇదిలా ఉంటే డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మెస్సీ రాక ఖరారైంది. జొమాటోకు చెందిన డిస్ట్రిక్ యాప్‌లో మెస్సీ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉంచారు. రూ.1750 నుంచి మొదలుపెడితే 30 వేల వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. మెస్సీకి ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ‘భారత అభిమానికి కృతజ్ఞతలు. మరికొన్ని రోజుల్లో భారత్‌కు రాబోతున్నాను. నా పర్యటనలో కోల్‌కతా, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ జత చేరింది. సీ యూ సూన్ ఇండియా’ అంటూ మెస్సీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.