కోల్‌కతా: సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. తమ ఆరాధ్య ఆటగాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని.. లైవ్‌లో అతడి ఆటను కండ్లనిండారా చూసి ఆ అపురూప క్షణాలను జీవితాంతం భద్రపరుచుకోవాలని ఒళ్లంతా కండ్లు చేసుకుని ఎదురుచూసిన వేలాది మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. బిదానగర్లోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ కార్యక్రమం పట్టుమని 15 నిమిషాల్లోపే ముగియడం అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆర్గనైజర్ల నిర్వహణ లోపంతో ఆగ్రహించిన అభిమానులు.. సాల్ట్‌లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ‘గోట్ ఇండియా టూర్’ ఆర్గనైజర్ శతధ్రు దత్తాను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెస్సీ కోల్‌కతా పర్యటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఉదయం 11.30 గంటలకు సాల్ట్ లేక్‌కు మెస్సీ చేరుకోగానే అక్కడే ఉన్న రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అతడిని చుట్టుముట్టారు. వారితో పాటు భద్రతా సిబ్బంది కూడా మెస్సీని కవర్ చేస్తూ ముందుకు సాగడంతో అభిమానులకు అతడు స్పష్టంగా కనిపించలేదు. స్టేడియంలో ఏర్పాటుచేసిన భారీ తెరలు సైతం మెస్సీని స్పష్టంగా చూపలేకపోయాయి. ఫ్యాన్స్ ‘మె స్సీ.. మెస్సీ’ నినాదాల మధ్య వారికి అభివాదం చేస్తూ సాగిన అతడిని నిర్వాహకులు.. 15 నిమిషాలు కూడా గడువకముందే అక్కడ్నుంచి తీసుకెళ్లారు. వాస్తవానికి అభిమానులతో అభివాదం తర్వాత అతడు మరో రెండు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
కానీ మెస్సీ ఉన్నట్టుండి అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వారంతా ‘వీ వాంట్ మెస్సీ.. వీ వాం ట్ మెస్సీ..’ అంటూ బిగ్గరగా అరిచారు. సహ నం కోల్పోయిన వారంతా వాటర్ బాటిళ్లు, కుర్చీలు మైదానంలో విసరడమే గాక బ్యానర్లను చించేసి నిరసన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బారీకేడ్లను తోసుకుని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారంతా లోపల ఏర్పాటుచేసిన క్రీడా సామాగ్రిని ధ్వంసం చేశారు. వారిని నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
నిర్వహణ లోపం కారణంగా ఉద్రిక్తతలకు దారితీసిన ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ మెస్సీ, అతడి అభిమానులకు ఎక్స్ వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తానూ స్టేడియానికి బయల్దేరినా అక్కడి పరిస్థితిని తెలుసుకుని వెనుదిరిగానని ఆమె రాసుకొచ్చారు. ఈ ఘటనపై జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటుచేస్తామని.. వైఫల్యానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోలీసుల లాఠీచార్జి అనంతరం పలువురు అభిమానులు నిర్వాహకులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మెస్సీని చూసేందుకు ఉదయం 8 గంటల నుంచే లైన్లో నిల్చున్నాం. నిర్వాహకులు అనవసర కార్యక్రమాలతో టైం వేస్ట్ చేశారు. మెస్సీ రాగానే అతడి చుట్టూ వీఐపీలు బెల్లం చుట్టూ ఈగల్లా మూగడంతో మాకేమీ కనిపించలేదు. ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 10వేలు టికెట్ చెల్లించి మరీ వస్తే నిర్వాహకులు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. బ్లాక్‌లో అయితే ఈ టికెట్లను రూ. 25వేల దాకా అమ్ముకున్నారు. ఒక్కొక్కరు తమ నెలవారీ జీతాన్ని ఈ ప్రోగ్రామ్ కోసం వెచ్చించి వచ్చారు’ అని అజయ్ షా అనే అభిమాని అసహనం వ్యక్తం చేశాడు.

ఈ వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ ‘గోట్ ఇండియా టూర్’ ఆర్గనైజర్ శతధ్రు దత్తాను కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా కార్యక్రమాన్ని ముగించుకుని మెస్సీతో పాటు హైదరాబాద్ బయల్దేరిన ఆయనను కోల్‌కతా విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతా ఈవెంట్‌కు వచ్చిన అభిమానుల టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ తెలిపారు

షెడ్యూల్ ప్రకారం శనివారం తెల్లవారుజామున మెస్సీ.. తన ‘ఇంటర్ మియామీ’ సహచర ఆటగాళ్లు రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెజ్‌తో కలిసి కోల్‌కతాకు చేరుకున్నాడు. ఉదయం లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో కలిసి వర్చువల్‌గా ఆవిష్కరించాడు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్నా భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు.