IPL : భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఐపీఎల్లో కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టనున్నాడు. జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా పనిచేసిన ఈ హైదరబాదీ ఐపీఎల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ కోచ్‌గా లక్ష్మణ్ నియమితులవ్వనున్నాడు.
పదిహేడో సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజం జస్టిన్ లాంగర్‌కు లక్నో కోచ్ బాధ్యతలు అప్పజెప్పింది. అయినా సరే లక్నో జట్టు ప్లే ఆఫ్స్ దాటలేకపోయింది. అందుకని ఈసారి భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవమున్న లక్ష్మణ్‌కు హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేయాలని లక్నో మేనేజ్మెంట్ భావిస్తోంది. ఒకవేళ లక్ష్మణ్ ఐపీఎల్ కోచ్ అవతారం ఎత్తితే.. భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విక్రమ్ రాథోర్ (Vikram Rathore) నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతాడని టాక్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. 18వ సీజన్లో ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలించాలి? అనేదానిపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో ఒక్కసారి కూడా టైటిల్ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ను వదిలించుకున్న ఢిల్లీ.. తాజాగా డాషింగ్ ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్‌లను సైతం వద్దనుకుంటోంది.

గత రెండు సీజన్లలో విఫలమైన పృథ్వీపై యాజమాన్యం అసంతృప్తితో ఉంది. 16వ సీజన్లో కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌ను సైతం అట్టిపెట్టుకునేందుకు ఢిల్లీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అంతేకాదు కెప్టెన్ రిషభ్ పంత్‌ను మరో సీజన్‌కు సారథిగా కొనసాగించడం కూడా అనుమానమే అనిపిస్తోంది. పంత్ సైతం ఢిల్లీని వీడి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోవాలని తహతహలాడుతున్నాట.
