Canada Open 2023 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen,) కెనడా ఓపెన్ ఫైనల్(Canada Open 2023)కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అతను11వ సీడ్ కెంటా నిషిమొటో(Kenta Nishimot)ను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. 44 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-17, 21-14తో గెలుపొందాడు. దాంతో, నిషిమొటోపై తన రికార్డును 2-1కు పెంచుకున్నాడు.
ఈ ఏడాది కాలంలో లక్ష్యసేన్‌కు ఇదే మొదటి వరల్డ్ టూర్ ఫైనల్ కావడం విశేషం. అవును.. 2022లో అతను కామన్వెల్త్ గేమ్స్(CommonWealth Games 2022) ఫైనల్లో ఆడాడు. ఈ సీజన్లో సేన్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అతను థాయ్లాంగడ్ ఓపెన్‌లో మూడో స్థానంలో సరిపెట్టుకున్నాడు. అందుకని ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. అనుకున్నట్టుగానే ఆఖరి మెట్టు వరకు చేరాడు.
మహిళల స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) మరోసారి నిరాశ పరిచింది. ఈ ఏడాది టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆమె సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 1 అకానే యమగుజి(Akane Yamaguchi) చేతిలో ఓటమిపాలైంది. రెండు సెట్లలో 14-21, 15-21తో దారుణ ఓటమి చవిచూసింది. ఈ ఏడాది యమగుజి సింధును చిత్తు చేయడం ఇది రెండోసారి.
పీవీ సింధు
సింగపూర్ ఓపెన్(Singapore Open)లో ఆమె భారత షట్లర్‌ను ఇంటికి పంపింది. సింధు చివరిసారిగా నిరుడు జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించింది. చీలమండ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈ సీజన్లో మిడ్ స్పెయిన్ మాస్టర్స్(Mid Spain Masters)లో రన్నరప్‌గా నిలిచింది. మలేషియా మాస్టర్స్(Malaysia Masters) ఓపెన్‌లో మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది.