Kyle Jamieson : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదహారో సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది అనగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి పెద్ద షాక్. ఆ జట్టు స్టార్ పేసర్ కైలీ జేమీసన్ టోర్నీకి దూరం కానున్నాడు. వెన్నెముక (స్ట్రెస్ ఫ్రాక్చర్) గాయంతో బాధపడుతున్న ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సర్జరీ చేయించుకోనున్నాడు. దాంతో, అతను నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. అందుకని ఈ సీజన్లో ఈ ఫాస్ట్ బౌలర్ ఆడడం దాదాపు అసాధ్యం.
2023 ఐపీఎల్లో తమ జట్టు కప్పు గెలవడంలో జేమీసన్ కీలకం అవుతాడనుకున్న సీఎస్కేకు నిజంగా ఇది షాకింగ్ న్యూస్. ఇప్పటికే అతను స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు.
లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ పొడగరి ఆల్‌రౌండర్ కోసం 2021 ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. అయితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే.. ఆ సీజన్లో అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో, జేమీసన్‌ను ఆర్సీబీ రిలీవ్ చేసింది. 2023 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. కోటికి ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, సీఎస్కే తలపడనున్నాయి.
ఆరడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే జేమిసన్ కివీస్ బౌలింగ్ లైనప్‌లో చాలా కీలకం. రెండేళ్ల క్రితం జరిగిన ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో న్యూజిలాండ్ విజయంలో జేమీసన్ కీలక పాత్ర పోషించాడు. భారత్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఇతను ఏడు వికెట్లు తీశాడు. దాంతో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకూ 16 టెస్టులు ఆడిన జేమీసన్ 19.45 సగటుతో 72 వికెట్లు పడగొట్టాడు. సర్జరీ కారణంగా అతను దాదాపు 4 నెలలు విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో, మార్చిలో శ్రీలంక, ఏప్రిల్‌లో పాకిస్థాన్ టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ అతని సేవలను కోల్పోనుంది.