భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఇన్నాళ్లు అశ్విన్, చాహల్, జడేజా నీడలో అంతగా వెలుగులోకి రాలేకపోయిన కుల్దీప్..తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పడుతున్నాడు. రెండేండ్ల క్రితం వరకు జట్టులో చోటే ప్రశ్నార్థకమైన వేళ పడిలేచిన కెరటంలా వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఎక్కడ తన ప్రాభవాన్ని కోల్పోయామో అక్కడే దక్కించుకోవాలనే రీతిలో అనూహ్యంగా పోటీలోకి వచ్చాడు. ఓవైపు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడంతో పాటు బౌలింగ్ శైలికి కొత్త మెరుగులు అద్దుకున్నాడు. కచ్చితత్వానికి స్పిన్‌ను జోడిస్తూ వికెట్ల వేటలో టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నాడు. ఆసియాకప్‌లో పాకిస్థాన్ నడ్డివిరిచిన కుల్దీప్.. లంక పనిపట్టాడు. స్వదేశం వేదికగా త్వరలో జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి కుల్దీప్ కొత్త వర్షన్‌తో రాబోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లకు పెను సవాలు విసిరేందుకు సిద్ధమవుతున్నాడు.
పుష్కర కాలం తర్వాత స్వదేశం వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత్ బ్రహ్మస్త్రంతో బరిలోకి దిగుతున్నది. పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా నిరీక్షిస్తున్న టీమ్ఇండియా సొంత ఇలాఖాలో తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నది. మెగాటోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న ఆసియాకప్‌లో రోహిత్‌శర్మ నేతృత్వంలోని భారత్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమ్ఇండియా..శ్రీలంకను జయిస్తూ బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. అయితే ఈ ప్రయాణంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భారత విజయాల్లో కుల్దీప్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. తన బౌలింగ్‌లో వాడి కోల్పోయి తుది జట్టులో చోటు కోల్పోవడంతో పాటు గాయాలతో సతమతమైన కుల్దీప్యాదవ్..రీఎంట్రీ అదిరిపోయింది.
2021 చివర్లో కుల్దీప్ కెరీర్ ఒక రకంగా ప్రమాదంలో పడింది బౌలింగ్‌లో సరైన వైవిధ్యం లేకపోవడం, ధారళంగా పరుగులు సమర్పించుకోవడం, సహచర స్పిన్నర్లు చాహల్, జడేజా, అక్షర్‌పటేల్, రవిబిష్ణోయ్ నిలకడగా రాణిస్తూ ఉండటం కుల్దీప్కు జట్టులో చోటును ప్రశ్నార్థకం చేశాయి. దీనికి తోడు అప్పటి వరకు ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీలక స్పిన్నర్‌గా సేవలందించిన కుల్దీప్ను రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం అతన్ని బాగా కుంగదీశాయి. ఫామ్‌లేమి ఓవైపు అయితే గాయాలు మరోవైపు వేధించడం కుల్దీప్ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టివేసింది. ఒకానొక దశలో తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన కుల్దీప్..జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) ద్వారా తనలో కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మెగాటోర్నీకి స్పెషలిస్టు స్పిన్నర్ కోటాలో చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వైపు చూసిన సెలెక్టర్లను తన నిలకడైన ప్రదర్శనతో ఈ యూపీ స్పిన్నర్ ఆకట్టుకున్నాడు. అయితే ఇదంతా ఒక్క రోజులో సాధ్యపడలేదు.
కుల్దీప్యాదవ్ తిరిగి భారత జట్టులోకి రావడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బాగా దోహదపడింది. అప్పుడప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కుల్దీప్ ఎలా గాడిలో పడాడో అతని చిన్ననాటి కోచ్ కపిల్ పాండే చెప్పుకొచ్చాడు. ‘ఫామ్‌లేమి, గాయాల బెడద, జట్టుకు దూరం కావడం కుల్దీప్ను బాగా కుంగదీశాయి. ఎలాగైనా గాడిలో పడాలన్న ఉద్దేశంతో గంటల కొద్ది నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కానీ ఏ బౌలర్‌కైనా అనుభవజ్ఞుడి సలహాలు బాగా పనికొస్తాయి. అదే సమయంలో భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషిని ఎన్సీఏలో కుల్దీప్ కలువడం అతని కెరీర్‌ను మలుపు తిప్పింది. బౌలింగ్ శైలిలో మార్పులతో పాటు వేగం పెంచడం కుల్దీప్కు కలిసొచ్చింది. బంతి వేసేటప్పుడు అడుగులు తగ్గించుకోవడంతో పాటు నేరుగా బ్యాటర్ లక్ష్యంగా బంతులు వేయడాన్ని యాదవ్ గంటల కొద్ది నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. దీనికి తోడు ఐపీఎల్లో కోల్‌కతా నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారడం కూడా కుల్దీప్ ఆత్మవిశాస్వాన్ని పెంచింది’ అని అన్నాడు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 14 వన్డేల్లో కుల్దీప్ 27 వికెట్లతో అందరికంటే టాప్‌లో దూసుకెళుతున్నాడు. పాక్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. రానున్న ప్రపంచకప్‌లోనూ కుల్దీప్ ఇదే ప్రదర్శన కొనసాగిస్తే భారత సుదీర్ఘ కల నెరవేరినట్లే.
ఎన్సీఏలో ఉన్ననన్ని రోజులు అక్కడి ఫిజియో అశిష్ కౌశిక్..కుల్దీప్యాదవ్కు అండగా నిలిచాడు. అశిష్ ఇచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని పాక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కుల్దీప్ చెప్పుకొచ్చాడు. ‘గతేడాది సర్జరీ తర్వాత మోకాలుపై మరింత భారం పడకుండా ఉండేందుకు రనప్ సులువుగా మార్చుకున్నాను. వేగంలో ఎక్కడా వెనుకకు తగ్గకూడదనే ఉద్దేశంతో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాల్సి వచ్చింది’ అని అన్నాడు.