IPL 2025 : ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టోర్నీని విజయంతో ముగించాలనుకుంటోంది. మే 25న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగబోయే గేమ్ కోసం మిస్టరీ స్పిన్నర్‌ను తీసుకుంది ఫ్రాంచైజీ. ఐపీఎల్ వాయిదా సమయంలో స్వదేశం వెళ్లిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొవ్మన్ పావెల్ (Rovman Powell) స్థానంలో శివం శుక్లా (Shivam Shukla)తో ఒప్పందం చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువకెరటంను స్క్వాడ్‌లో చేర్చుకున్నామని ఆదివారం కోల్‌కతా ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న శివం శుక్లా రాకతో కోల్‌కతా స్పిన్ బలం మరింత పెరగనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 29 ఏళ్ల శుక్లా ఒకే సీజన్ ఆడాడు. బెంగాల్‌పై 29 పరుగులకే 4 వికెట్లతో సత్తా చాటాడు. నిరుడు మధ్యప్రదేశ్ లీగ్‌లోనూ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న శివం 10 వికెట్ల తీశాడు. దాంతో, ఆ లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడీ యంగ్‌స్టర్.
🚨 The mystery spinner from MP is a Knight now!
Shivam Shukla replaces Rovman Powell for the remainder of the #TATAIPL2025 pic.twitter.com/usUoOnFzLG
— KolkataKnightRiders (@KKRiders) May 18, 2025
పదిహేడో సీజన్లో సంచలన ఆటతో టైటిల్ కొల్లగొట్టిన కోల్‌కతా ఈసారి మాత్రం ఉసూరుమనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 18వ సీజన్ ఆడిన అజింక్యా రహానే బృందం బ్యాటింగ్‌లో తేలిపోయింది. టాపార్డర్ వైఫల్యానికి తోడు హిట్టర్లు రింకూ సింగ్ (Rinku Singh), ఆండ్రూ రస్సెల్ (Andrew Russel) దారుణంగా విఫలమవ్వడం ఆ జట్టు విజయావకాశాల్ని దెబ్బకొట్టింది.
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
అయితే.. ఆఖర్లో పుంజుకొని 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. కానీ, ఐపీఎల్ వాయిదా పడ్డాక జరిగిన తొలి పోరు వర్షార్ఫణం కావడంతో కోల్‌కతాకు కన్నీరే మిగిలింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. దాంతో, ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించింది. దాంతో, టోర్నీ నుంచి వైదొలిగిన కోల్‌కతా.. మే 25న సన్‌రైజర్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.